చండూరు, జూలై 2: బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదంటూ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని హెచ్చరించారు. చండూరు మున్సిపాలిటీలో మాజీ ఎంపీపీ తోకల వెంకన్నకు చెందిన వాణిజ్య భవనాన్ని మం గళవారం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న కూసుకుంట్ల బుధవారం కూల్చివేసిన భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భగా కూసుకుంట్ల మాట్లాడుతూ అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తోకల వెంకన్నకు చెందిన వాణిజ్య భవనాన్ని కూల్చివేయడం నీచమైన చర్య అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేసి పనులు మొదలు పెట్టామన్నారు. మున్సిపల్ కేంద్రంలో డీపీఆర్ ప్రకారం రహదారి విస్తరణకు 90 ఫీట్లు ఉంటే, ఇప్పుడు అది ఎవరి లాభం కోసం 80 ఫీట్లకు తగ్గించారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మించిన ఇతరుల భవనాలను కూల్చకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుడి భవనాన్ని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని, ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలో భాగమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీపీఆర్ పై స్పష్టత లేదు..
చండూరులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్‌పై మున్సిపల్ అధికారులు స్పష్టత ఇచ్చిన దాఖాలాలు ఇప్పటి వరకు లేవన్నారు. ఇప్పటికైనా వాణిజ్య భవనాల యాజమానులకు డీపీఆర్ చూపించాలన్నారు. డీపీఆర్ చూపించకుండా మున్సిపల్ అధికారులు జాగ్రత్త పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే అనుచరుల అవసరాలను కాకుండా, ప్రజల అవసరాలకు అనుగుణంగా డీపీఆర్ ప్రకారం పనులు చేయలని డిమాండ్ చేశారు.
ఒక్క రూపాయి తీసుకురాని ఎమ్మెల్యే..
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడిచినా తాము మంజూరు చేసిన నిధులే తప్ప ఒక్క రూపాయికూడా నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే తీసుకురాలేదన్నారు. తన కాంట్రాక్టర్ల కోసం పూటకో మాట.. రోజుకో వేషం వేస్తూ వివిధ పార్టీలు మారుతూ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. రాజగోపాల్ గెలిచిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చండూరు మండల కేం ద్రంలో చర్చకు సిద్ధమా అంటూ కూసుకుంట్ల సవాల్ విసిరారు.
రాజగోపాల్‌రెడ్డి పెద్ద అబద్ధాల కోరు అని, అబద్ధాలు చెప్పడంలో ఎవరికైనా పద్మశ్రీ ఇస్తే అది గోల్మాల్ గోపాలంకే ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో చండూరు మం డల, పట్టణ అధ్యక్షుడు బొమ్మరబోయిన వెం కన్న, కొత్తపాటి సతీశ్, చండూరు మాజీ ఎం పీపీ కర్నాటి వెంకటేశం,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రం వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, మాజీ కౌన్సిలర్లు కోడి వెం కన్న, గుంటి వెంకటేశం, బొడ్డు సతీశ్, పెద్దగోని వెంకన్న, కురుపాటి సుదర్శన్, తేలుకుంట్ల చంద్రశేఖర్, తేలుకుంట్ల జానయ్య, రావిరాల నగేశ్, ఇరిగి గురునాథం, చొప్పరి దశరథ, మాజీ సర్పంచ్‌లు నర్సిరెడ్డి, లింగయ్య, మం డల పట్టణ నాయకులు పాల్గొన్నారు.