నల్లగొండ ప్రతినిధి, జూన్27 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం నల్లగొండ జిల్లా పర్యటనకు రానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన కనగల్ మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.13వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హ్యామ్‌రోడ్ల పథకానికి సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో జరుగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రెండున్నరేండ్ల పాలనలో రేవంత్‌రెడ్డి రెండోసారి నల్లగొండ పర్యటనకు వస్తున్నారు. గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం, నేడు మరోసారి నల్లగొండలో పర్యటించనున్నారు.
అయితే ఈ రెండున్నర ఏండ్లలో రాష్ట్రప్రభుత్వం కాని, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండకు చేసిందేమిటంటూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ బహిరంగలేఖ రాశారు. నల్లగొండ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే రూ.3వేల కోట్లు మంజూరు చేయాలని బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. నల్లగొండ నియోజకవర్గ సమస్యలు నేటికీ ఎకడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెలికాప్టర్లలో తిరుగుతూ నల్లగొండ ప్రజలను గాలికి వదిలేశారని ఆరోపించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ అభివృద్ధికి రూ.వేల కోట్లు మంజూరు చేస్తే అందులో కొన్ని అప్పుడే పూర్తి కాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కేసీఆర్ మంజూరీ చేసిన పథకాలన్నీ నల్లగొండ ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు నల్లగొండ రూపు రేఖలు మార్చే పథకాలన్నారు. కానీ రెండున్నర ఏండ్ల కాలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వీటి వైపు కూడా కన్నెత్తి కూడా చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ క్లాక్ టవర్ నడిబొడ్డున ఆర్అండ్బీ అతిథి గృహం కోసం కేసీఆర్ నిర్మించిన అత్యాధునిక భవనాన్ని మాత్రం తన నివాసంగా మార్చుకుని మిగతా పనులను అటకెక్కించారన్నారు.
ఆయన నివాసమైన ఇందిరా భవన్ నుంచి కనిపించే నల్లగొండ కళాభవన్ నిర్మాణం కోసం తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. ఇక డీఈవో ఆఫీసు నుంచి క్లాక్‌టవర్ సెంటర్, రామగిరి మీదుగా రైల్వే ఫె్లైఓవర్, పానగల్ బైపాస్ రోడ్డు వరకు రహదారి అధ్వానంగా ఉందన్నారు. కేవలం కమీషన్లు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇస్తూ ప్రజల తక్షణ సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. నేటికీ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం, ఉదయసముద్రం ప్రాజెక్టు పనులు ఎకడ వేసిన గొంగళి అకడే అన్న చందంగా ఉన్నాయన్నారు. సీఎంకు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి రాసిన బహిరంగ లేఖలో పెండింగ్ పనులు, తదితర ప్రధాన అంశాలను ప్రస్తావించారు.
ఇట్లు
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి