రాజాపేట, జూలై 6 : ‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వ్యక్తి కాదు శక్తి.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ జాతిపిత. తొమ్మిదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన అభివృద్ధి ప్రదాత. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన అపర భగీరథుడు. సబ్బండ వర్గాల సంక్షేమ వారథి. అలాంటి కేసీయారే ప్రజలకు శ్రీరామరక్ష. ఆయన అంటేనే తెలంగాణకు ఓ భరోసా. అలాంటి వ్యక్తి పాలన కోసమే రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. పార్టీలో బుల్లెట్ లాంటి కార్యకర్తలు ఉన్నారు’ అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అమలుకు నోచుకోని 420 హామీలు..
తమది ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తోంది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి మరిచి ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలుకు నోచుకోలేదు. రుణమాఫీ పూర్తికాలేదు. రైతు బంధు అందిందీలేదు. అసెంబ్లీలో మీకు సమాధానం చెప్పడానికి కేటీఆర్, హరీశ్‌రావు చాలు. వారు అడిగే ప్రశ్నలకే మీరు తికమక పడుతున్నారు. అలాంటిది కేసీయారే అసెంబ్లీకి వస్తే మీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోండి.
చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు
ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా మర్చిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారు. గంధమల్ల ప్రాజెక్టుకు గత ప్రభుత్వ హయాంలోనే డీపీఆర్ సిద్ధం చేశాం. ఎన్నికల సమయంలో కాస్త ఆలస్యమైంది. అప్పుడు మంజూరైన గంధమల్ల ప్రాజెక్టు పనులకు మళ్లీ శంకుస్థాపన చేశారు. యాదాద్రి మెడికల్ కళాశాలకు అప్పటి మంత్రి తన్నీరు హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. మల్లాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమి 20 ఎకరాలు కేటాయించాం. నిధులు మంజూరయ్యాయి. అవే పనులకు మళ్లీ శంకుస్థాపనలు.. పొట్టిమర్రి కాల్వపల్లి, బేగంపేట, కొలనుపాక వాగులపై హై లెవెల్ బ్రిడ్జీలు, సీసీ రోడ్లు మంజూరై గత ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపనలు చేస్తే మళ్లీ సీఎంతో శంకుస్థాపనలు చేయిస్తున్నారు.
ప్రజాస్వామ్యం కనుమరుగు
ఆలేరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కనుమరుగైంది. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తూ, కేసులు పెడుతూ నిర్బంధిస్తున్నారు. ఆరాచక పాలన, కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే చాలు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అంగ బలం, ఆర్థిక బలం, రాజకీయ బలంతో ప్రతిపక్ష నేతలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
అరిగోస పడుతున్న రైతులు
ఎన్నికల ముందు ఎన్నో వాగ్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను తుంగలో తొకింది. సగం మంది రైతులకే రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ చేశామంటూ ప్రకటనలు చేశారు. గ్రామాల్లో రైతులు అరిగోస పడుతున్నారు. కొద్ది మంది రైతులకు రుణమాఫీ చేసి మిగతా రైతులకు రుణమాఫీ చేయలేదు. రైతులకు పెట్టుబడి సాయంగా అందించాల్సిన రైతు భరోసా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మూడు ఎకరాల్లోపు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వలేదు. రైతుబీమా చెల్లించకుండా పథకాన్ని కనుమరుగు చేసే కుట్ర చేస్తోంది. నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత మళ్లీ ప్రారంభమైంది.
స్థానిక ఎన్నికల్లో గుణపాఠం చెబుతాం
18 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జనం బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి మర్చిపోలేని గుణపాఠం నేర్పడం ఖాయం.
రాష్ట్రంలో బేకార్ పాలన..
కాంగ్రెస్ పార్టీ 19 నెలల కాలంలో రాష్ట్రంలో బేకార్ పాలన అందించింది. అడుగడుగునా ప్రజలను, ప్రతిపక్ష పార్టీ నేతలను భయపెడుతూ నిర్బంధ పాలన కొనసాగిస్తోంది. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తూ, కేసులు పెడుతూ, నిర్బంధాలతో భయబ్రాంతులకు గురిచేస్తూ కక్షపూరిత రాజకీయాలకు తెరలేపుతోంది. ఆలేరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన శంకుస్థాపనలకు మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ ఏదో అభివృద్ధి చేస్తున్నామంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నడూ లేనివిధంగా అరాచకాలు సృష్టిస్తూ రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారు. కల్లబొల్లి మాటలతో పాలన సాగిస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరో ఉద్యమం చేపడతాం.