యాదాద్రి భువనగిరి, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల ప్రారంభ సూచికగా హనుమకొండలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం భువనగిరిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆలేరు నియోజకవర్గ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆలేరు నియోజవర్గం నుంచి 600 సొంత వాహనాలు, 200 బస్సుల్లో శ్రేణులు తరలివెళ్లాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎంత దుర్భరంగా ఉందో హన్మకొండ సభ చాటి చెబుతుందన్నారు. కాంగ్రెస్ ఏ ఒక హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. అధికారిక లెకల ప్రకారమే రాష్ట్రంలో 400 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అనధికారికంగా ఇంకెంతో మంది ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లో ఓల్టేజీ కరెంట్‌తో వ్యవసాయ మోటార్లు కాలిపోయి రైతులు మరింత నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సకాలంలో ఎరువులు లేక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సాగు, కరెంటు సరిగ్గా లేక పంటలు ఎండిపోతుంటే పట్టించుకోకుండా రేవంత్‌రెడ్డి అవహేళనగా మాట్లాడుతున్నారని, ఆయన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎండలకు పంటలు ఎండిపోయాయని మాట్లాడడం సరికాదని అన్నారు. రైతులకు ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వాలే వారిని మనోవేదనకు గురిచేసేలా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
రుణమాఫీపై కాకి లెకలు పకనపెట్టి.. అర్హులందరికీ రుణమాఫీ డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు పథకం కింద రైతులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల కోరారు. ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక కేవలం సన్నవడ్లకు మాత్రమే ఇస్తామనడం దుర్మార్గమన్నారు. అన్ని పంటలకు రూ.500 బోనస్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సంబంధించి ఉగాదిలోగా మంచి నిర్ణయం తీసుకోకపోతే, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేఆన్ని గాలికి వదిలి ప్రజా సమస్యలు, హామీల అమలుపై ప్రశ్నించిన విపక్ష, ప్రజా సంఘాల నాయకుల నిర్బంధంపైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు. సివిల్ వ్యవహారాల్లో పోలీసులు మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.
సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కర్రె వెంకటయ్య, పోలగాని వెంకటేశ్‌గౌడ్, బీసు చందర్ గౌడ్, మహ్మద్ ఖలీల్, సటు తిరుమలేశ్, పిన్నపరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు తోటకూర అనురాధాబీరయ్య, పల్లా వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీలు ఇందిరాసత్యనారాయణరెడ్డి, బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, మదర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు ఇమ్మడి రామిరెడ్డి, మొగలుగాని మల్లేశ్‌గౌడ్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.