యాదాద్రి భువనగిరి, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంటింటి సర్వేపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. సర్వే సరిగ్గా లేదని, పారదర్శకంగా చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. భువనగిరి పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సర్వే పై ప్రజలకు ఉపయోగం ఏమిటో స్పష్టంగా చెప్పాలని, వారికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చి సర్వే చేయాలని తెలిపారు. అనాలోచిత నిర్ణయాలతో సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ప్రజలు అధికారులపై తిరగబడ్డారని చెప్పారు. రేవంత్ రెడ్డి భాషను అనుకరిస్తూ.. ప్రజలు అధికారులపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. కొడంగల్ దాడి ఘటనలో రేవంత్ రెడ్డిని కుట్రదారుగా చేయాలన్నారు.
సర్వే పై లోపించిన పారదర్శకత
గతంలో కేసీఆర్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వేను ఒకరోజులో రాష్ట్రం మొత్తంలో 1.30 లక్షల కుటుంబాలకు 3,80 వేల మంది ఎన్యూమరేటర్లతో కుటుంబ సర్వే చేపట్టారని గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గుర్తు చేశారు. అప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబ ఆర్థిక, రాజకీయ, సామాజిక వివరాలు చెప్పొద్దని చెప్పి.. నేడు ఎందుకు సర్వే చేపడుతున్నారని ప్రశ్నించారు. 60 రోజుల సమయం పెట్టడంతో పనులు మానుకొని ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. సర్వేలో పూర్తిగా పారదర్శకత లోపించిందని చెప్పారు. సీఎం అనాలోచిత నిర్ణయాలు, సమగ్ర ప్రణాళిక లేకపోవడంతో సర్వే సక్రమంగా జరుగడం లేదన్నారు. ఎస్సీ కులగణన చేయాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే రాష్ట్రంలో ముందు చేసి ఆదర్శంగా నిలుస్తామన్న మాట ఏమైందన్నారు.
పాలకుడు ఏ విధంగా మాట్లాడుతారో ప్రజలు కూడా ఆ విధంగానే నడుచుకుంటారని, లగుచర్ల ఫార్మా ప్రజాభిప్రాయ సేకరణలో అధికారులపై దాడులే ఇందుకు నిదర్శనమని తెలిపారు. మూసీపై డీపీఆర్ తయారు చేయలేదని, తల తోక లేకుండా కిలోమీటర్ నడిచి పాదయాత్ర అనడం సిగ్గుచేటన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న రాష్ట్రాన్ని అభాసుపాలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దకుతుందని విమర్శించారు. మంచి పనులు చేసే స్వాగతిస్తామని, లోటుపాట్లు ఉంటే ప్రజల పక్షాన నిలబడి తప్పకుండా ప్రశ్నిస్తామన్నారు. హామీలపై ప్రజల దృష్టి మరల్చేందుకు హైడ్రా, మూసీ, సినీ సెలబ్రిటీలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ డ్రామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాలయాపనతో పాలన : క్యామ మల్లేశ్
రాష్ట్రంలో పాలన చేతకాక సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేయడం, పొలిటికల్ డైవర్షన్‌కు పాల్పడుతూ కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ మండిపడ్డారు. 11 నెలల కాలంలో ఏ ఒక సంక్షేమ పథకం అమలు చేయలేదని, రేవంత్ రెడ్డి వ్యవహారం వీధి రౌడీలా ఉందని అన్నారు. తన స్థాయి మరిచి, సీఎం హోదాను వీడి బు ల్డోజర్తో తొకిస్తాం.. నరికేస్తాం.. పీకే స్తాం అని మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భాష తీరు మార్చుకోవాలని, తెలంగాణ ప్రతిష్టతను దిగజార్చ వద్దని హితవు పలికారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని, అది రాజ్యాంగం ఇచ్చిన హకు అని స్పష్టం చేశారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని, రైతు బంధు, పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మెన్ ఎనబోయిన ఆంజనేయులు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, మాజీ జడ్పీటీసీలు బీరు మల్లయ్య, తోటకూర అనురాధ, నాయకులు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, ఎంవీ కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, ఓం ప్రకాశ్ పాల్గొన్నారు.