నల్లగొండ, అక్టోబర్ 18 : కాంగ్రెస్ పాలనలో నకిరేకల్ నియోజకవర్గంలో పోలీసులు దమనకాండ సాగిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులతో అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై వేలాది తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు.
ప్రధానంగా నకిరేకల్ సీఐ రాజశేఖర్, కేతేపల్లి, కట్టంగూర్ ఎస్ఐలు కాంగ్రెస్ కార్యకర్తల్లా ప్రవరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు చేసిన వాళ్లను వదిలిపెట్టి దెబ్బలు తిన్న తమ కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి పేదల ఇండ్లు కూల్చుతుంటే, నకిరేకల్‌లో తొమ్మిది నెలల కాలంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయని ఎమ్మెల్యే అన్ని మండలాల్లో దౌర్జన్యాలు, దందాలు, అక్రమ కేసులు, దాడులు చేయిస్తూ రాక్షసానందం పొందుతున్నాడని ఆరోపించారు. పోలీసులు ఆయనకు లెఫ్ట్, రైట్ అనుకుంటూ చేస్తున్న అక్రమాలతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండ్రోజులకే కేతేపల్లి మండలం చెర్కుపల్లికి చెందిన సైదులును చెట్టుకు కట్టేసి కొడితే తిప్పర్తి పోలీసులు వచ్చి విడిచి పెట్టిన ఘటనలోనూ నిందితులపై కేసులు పెట్టకపోగా సైదులుపైనే కేసు పెట్టడం దారుణమన్నారు. అదే మండలంలో ప్రదీప్‌రెడ్డిపై సూర్యాపేట నుంచి వచ్చిన రౌడీలు చేసిన దాడి చేశారని, దసరా రోజున మండల కేంద్రంలోని ముగ్గురు యువకులపై 14 మంది నిర్ధాక్షిణ్యంగా చేసిన దాడిని పోలీసులు పట్టించుకోకపోగా బాధితులపై యువకులపైనే కేసు పెట్టారని తెలిపారు. కట్టంగూర్ మండలంలోని దుగినెల్లి, నకిరేకల్ మండలంలోని మంగళపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు రాత్రికి రాత్రే కూల్చి బొడ్రాయి పెట్టించారని మండిపడ్డారు.
నకిరేకల్ మాజీ ఎంపీపీ మాధవరావుపై అకారణంగా దాడి చేయడం, పామనుగుండ్ల మాజీ సర్పంచ్ సైదిరెడ్డిని విచక్షణారహితంగా కొట్టడం వెనుక ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్న రౌడీషీటర్లేనన్నది పోలీసులను తెలియదా అని ప్రశ్నించారు. కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం మాజీ ఎంపీటీసీ రాములు ఇంట్లో దూరి, కండ్లల్లో కారం చల్లి అకారణంగా దాడి చేశారని, కడపర్తిలో గొర్ల భిక్షమయ్యకు చెందిన వ్యవసాయ బావి వద్ద పైపులను అదే గ్రామానికి చెందిన గన్‌మన్ పగులగొడితే ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. కేతెపల్లి ఎస్ఐ ఇటీవల కనీసం రెండు వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాడని, ఈ విషయంపై ఎస్పీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు నియోజకవర్గంలో దోచుకోవడం, దాడులు చేయడం వంటివి చేస్తుంటే పోలీసులు వారికి అండగా ఉంటున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలను నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కు రానిచ్చే పరిస్థితి లేదని, అసలు అది స్టేషన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా అన్నది సీఐ రాజశేఖర్ చెప్పాలన్నారు. ఎమ్మెల్యేకు చెంచాగిరీ చేస్తున్న సీఐ పద్ధతి మార్చుకోవాలన్నారు. ఎస్పీ స్పందించి ఈ తొమ్మిది నెలల కాలంలో నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై నమోదైన కేసుల వివరాలను పరిశీలించి, సంబంధిత పోలీస్ యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు దమనకాండను ఆపకపోతే బీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో పోలీసులు మేలు చేయకపోయినా ఫర్వాలేదు గానీ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టొద్దన్నారు. అక్కడ బీఆర్ఎస్ను నామరూపాల్లేకుండా చేద్దామనే కుట్ర మానుకోవాలని హితవు పలికారు. ప్రజల్లో కేసీఆర్‌పై ఉన్న నమ్మకం, బీఆర్ఎస్ పార్టీపై ఉన్న విశ్వాసం పోగొట్టడం ఎవరి తరమూ కాదన్నారు. పోలీసులు కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్న కార్యకర్తల్లా డ్యూటీ చేయడం మాని ప్రజల్లో విశ్వాసం పొందాలన్నారు. ఎస్పీ ప్రత్యేక చొరవ చూపి అక్రమ కేసులపై పరిశీలించాలని కోరారు.