– ఏఎమ్మార్పీ నాలుగో మోటార్ మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేయాలి
– గుడిపల్లి, గుర్రంపోడ్ మండలాల్లో ఎండుతున్న పంటలు
– కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి
నీలగిరి, ఆగస్టు 11 : ప్రభుత్వ ప్రణాళికా లోపంతో నల్లగొండ జిల్లా రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. జిల్లాలో సాగునీటి సమస్యలు తీర్చాలని కోరుతూ గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం నల్లగొండ కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా రైతులు సాగు నీటి సమస్యలతో నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిండినా, ఏఎమ్మార్పీ ప్రాజెక్ట్ ద్వారా ఆయకట్టుకు తగిన నీరు అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ఏఎమ్మార్పీ నాలుగో మోటార్ (యూనిట్) క్యాపిటల్ ఓవర్‌హాలింగ్ మరమ్మతు పనులు రెండు నెలల క్రితం ప్రారంభమైనప్పటికీ, సకాలంలో పూర్తిచేయకపోవడం ఘోర వైఫల్యం అన్నారు. జూలైలోనే పూర్తి కావాల్సిన ఈ పనులు, ఆగస్టు నెల వచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు చెప్పారు. ఈ ఆలస్యం వల్ల ప్రస్తుతం మూడు మోటార్ల ద్వారా 1,800 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల అవుతోందన్నారు. అందులో 525 క్యూసెక్కులు జంట నగరాలకు, 30 క్యూసెక్కులు మిషన్ భగీరథకు, 1,200 క్యూసెక్కులు ఉదయ సముద్రం నింపేందుకు వాడుతున్నారు. దీంతో ఆయకట్టుకు నీరు చేరడం లేదన్నారు.
ప్రధాన కాల్వ నీటి విడుదలను 1,200 క్యూసెక్కుల నుండి 950 క్యూసెక్కులకు తగ్గించడం జరిగిందన్నారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్‌కి చేరి, గుడిపల్లి, గుర్రంపోడ్ మండలాల్లో వేల ఎకరాల పంటలు ఎండిపోతున్నట్లు చెప్పారు. ఇది మాత్రమే కాకుండా శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా విడుదలైన నీటిని నిల్వ చేసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. సరైన ప్రణాళికతో నిల్వ చేసి ఉంటే నల్లగొండ జిల్లాకు ఈ స్థాయి కష్టాలు వచ్చేవి కావని తెలిపారు. ఉదయ సముద్రం ప్రాజెక్ట్‌కు 1,200 క్యూసెక్కుల నీటిని కేటాయిస్తూనే, అందులో కేవలం 1.2 క్యూసెక్కుల నీటిని తాగునీటి కోసం వినియోగించడం, మిగతా నీరును సరైన విధంగా పంపిణీ చేయకపోవడం బాధాకరం అన్నారు. కేవలం 0.5 క్యూసెక్కుల నీటితో బ్రాహ్మణ వెల్లంల, ఉదయ సముద్రం, అయిటిపాముల ప్రాజెక్ట్‌లను నింపడం అసాధ్యం అని సాంకేతికంగా తెలిసినా ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించిందని తెలిపారు.
గత సంవత్సరం ఇదే పరిస్థితి ఏర్పడినప్పటికీ పాఠాలు నేర్చుకోకుండా, ఈ ఏడాది ముందస్తు ప్రణాళికలు లేకుండా వ్యవహరించడం రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అగౌరవాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు. సాగర్‌లో నీరు సమృద్ధిగా ఉండి కూడా, రైతులు ధర్నాలకు దిగే పరిస్థితి రావడం దురదృష్టకరం అన్నారు. కాబట్టి, దీనిపై ప్రభుత్వం తక్షణ జోక్యం చేసుకుని ఏఎమ్మార్పీ నాలుగో మోటార్ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన వెంటనే పూర్తి చేయాలని, మోటార్లన్నీ పూర్తిస్థాయిలో పనిచేసేలా చేసి, రోజుకు కనీసం 2,400 క్యూసెక్కుల నీటి విడుదలకు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లకు సమానంగా సాగునీరు చేరేలా పర్యవేక్షణ బలోపేతం చేయాలని, శ్రీశైలం, ఉదయ సముద్రం నీటి వినియోగంపై సమగ్ర సమీక్ష చేసి, జిల్లాకు గరిష్ట లాభం చేకూరేలా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల రైతుల ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోందని, తక్షణ చర్యలు తీసుకోకపోతే జిల్లా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే పరిస్థితి తప్పదని హెచ్చరించారు.
Nalgonda : ప్రభుత్వ ప్రణాళికా లోపంతో రైతులకు నీటి కష్టాలు : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి