కట్టంగూర్, మే 25 : ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ నాయకులపై చేస్తున్న వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు. సోమవారం కట్టంగూర్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పెద్దల మెప్పు కోసం కేటీఆర్, హరీశ్‌రావులపై స్థాయికి మించిన వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే దిగజారుడు రాజకీయాలకు నిదర్శమని విమర్శించారు. రాజకీయ భిక్ష పెట్టిన బీఆర్ఎస్ నాయకత్వంపై మాట్లాడే ముందు తన గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో నర్ర రాఘవరెడ్డితో పాటు మేమున్నప్పుడు మంచి వాతావరణం ఉండేదని, ఇప్పుడు ఆటవిక పాలన నడుస్తోందని అన్నారు. నియోజకవర్గంలో 30 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉందన్నారు.
మంత్రులు రాకముందు తూకాల్లో ఎనిమిది కేజీల వరకు కటింగ్ చేసేవారని, వారు వచ్చిన తరువాత 10 నుంచి 12 కేజీలకు పెరిగిందని అన్నారు. లారీ వెయిటింగ్ ఛార్జీల పేరుతో బస్తాకు అదనంగా రూ.10 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు విజయవాడ, ఖమ్మం, ఛత్తీష్‌ఘడ్ నుంచి తక్కువ ధరకు ధాన్నాని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రాత్రికిరాత్రే కాంటా వేసి మిల్లులకు తరలించడంతో ఇక్కడి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, మాజీ సర్పంచ్‌లు వడ్డె సైదిరెడ్డి, దాసరి సంజయ్‌కుమార్, నాయకులు పెద్ది బాలనర్సయ్య, చౌగోని జనార్థన్, అంతటి శ్రీనివాస్, యర్కల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.