రామన్నపేట, సెప్టెంబర్ 24 : ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా నాటకం ఆడుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు, రైతులు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి కింద రూ.లక్షా పదహారు వేలతోపాటు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, రైతులకు రైతు భరోసా ఎకరానికి రూ.15వేలు అందించాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా గ్రామపంచాయతీల నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో పారిశుధ్య నిర్వహణ, పైప్లైన్ల మరమ్మతుల కోసం కార్యదర్శులు లక్షల రూపాయలు అప్పులు తెచ్చి చేతి నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోచబోయిన మల్లేశం, నాయకులు బందెల రాములు, బొక్క మాధవరెడ్డి, సాల్వేరు అశోక్, మిర్యాల మల్లేశం, జాడ సంతోశ్, బద్దుల రమేశ్, పున్న వెంకటేశం, ఆవుల నరేందర్, బాలగోని శివ, బట్టె కృష్ణమూర్తి, జాల అమరేందర్‌రెడ్డి, బొడ్డుపల్లి రాజు ఉన్నారు.