రామగిరి, సెప్టెంబర్ 16 : ఎటుచూసినా చూసినా ఉత్సవ శోభ.. ఎక్కడ విన్నా గణపతి నామస్మరణ.. కోలాటాలు.. డీజే పాటలు.. బ్యాండ్ చప్పుళ్లు.. తీన్మార్ స్టెప్పుల నడుమ లంబోధరుడిని నిమజ్జన శోభాయాత్రలు అట్టహసంగా సాగాయి. నవరాత్రులు ఘనంగా పూజలు అందుకున్న గణనాధులను సోమవారం ప్రత్యేకంగా అలంకరించి వాహనాలపై భక్తిశ్రద్ధలతో తరలించి గంగమ్మ ఒడికి చేర్చారు. నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి వంటి పట్టణాల్లో శోభాయాత్ర సంబురం అంబరాన్నంటింది. గల్లీగల్లీ జై గణేశ్ మహారాజ్కీజై నినాదాలతో హోరెత్తాయి. నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ హనుమాన్‌నగర్‌లో ఏర్పాటుచేసిన ఒకటో నెంబర్ గణపయ్య విగ్రహం వద్ద రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ఇక్కడ లడ్డూను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి రూ.13.50 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది ఈ మండపం వద్ద లడ్డూ రూ.36లక్షలు పలికింది. నల్లగొండ జిల్లాకేంద్రంలో శోభాయాత్రలు ఉదయం ప్రారంభం కాగా, సాయంత్రానికి ఒక్కో విగ్రహం క్లాక్‌టవర్ సెంటర్‌కు చేరువడంతో అక్కడంతా ఉత్సవ వాతావరణం నెలకొంది. గణనాథులను చూసేందుకు తరలివచ్చిన భక్తులతో పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఒకటో నెంబర్ విగ్రహం మంత్రితోపాటు కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ శరత్‌చంద్రపవార్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కర్నాటి విజయ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి పూజల్లో పాల్గొన్నారు. శోభయాత్ర ప్రారంభానికి ముందు జరిగిన సభలో ప్రముఖ వక్త అప్పల ప్రసాద్ వినాయక విశిష్టతను వివరించగా.. ఈ వేడుకల్లో ముస్లిం మత పెద్దలు కూడా పాల్గొనడం విశేషం. నల్లగొండ పట్టణంలో మొత్తం 750కిపైగా విగ్రహాలు నిమజ్జనానికి తరలాయి. శ్రీనగర్‌కాలనీలో ఏర్పాటుచేసిన 25 ఫీట్ల విగ్రహం, సావర్కర్‌నగర్ రోడ్డు నెం.1, విద్యానగర్‌లో పెట్టిన 26 అడుగుల విగ్రహాలను శోభాయాత్రలు అత్యంత వైభవంగా సాగాయి. వీటికాలనీలోని పంచముఖ హనుమాన్ దేవాలయంలోని మట్టి వినాయకుడి నిమజ్జనోత్సవానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పూజలు చేసి
ప్రారంభించారు.
బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 16 : అన్ని మతాలు, కులాల వాళ్లు కలిసి పండుగలు చేసుకుంటూ సూర్యాపేటను గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి ప్రతీకగా నిలుపుతున్నారని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని వేదాంత భజన మందిరంలో ఏర్పాటుచేసిన మట్టి గణపతి విగ్రహానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో చాలావరకు గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో ముస్లింలు పాల్గొన్నారన్నారు. పట్టణ చరిత్రలో ఇప్పటి వరకు అవాంఛనీయ సంఘటనలేవీ జరుగకుండా గణేశ్ ఉత్సవాలను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఎప్పటిలాగే అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చి వేడుకలు నిర్వహించడం మంచి విషయమన్నారు. సూర్యాపేట బొడ్రాయి పునఃప్రతిష్ట విషయంలో అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకొని ముందుకు సాగాలన్నారు. గణేశ్ నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో, భక్తి శ్రద్ధలతో జరిగేందుకు కృషి చేసిన ఉత్సవ కమిటీలకు శుభాకాంక్షలు తెలిపారు.
నల్లగొండ జిల్లాకేంద్రంలోని వల్లభరావు చెరువు, 14వ మైలురాయి, నాగార్జునసాగర్ బిడ్జి గణేశ్ విగ్రహ నిమజ్జనాలను వద్ద కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ శరత్‌చంద్రపవార్ పర్యవేక్షించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. నల్లగొండలో ఏర్పాటుచేసిన చిన్న విగ్రహాలను వల్లభరావు చెరువు, పెద్ద విగ్రహాలను 14వ మైలురాయి, నాగార్జునసాగర్‌కు తరలించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన విగ్రహాలను ఉదయమే శ్రీశైలం, భద్రాచలం, వాడపల్లి ప్రాంతాలకు తీసుకువెళ్లారు. నల్లగొండ పట్టణంలో ఎస్పీ పర్యవేక్షణలో 650 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుని సక్సెస్ అయ్యారు. నిమజ్జన ప్రదేశాల్లో అధికారులు ప్రత్యేక క్రేన్లు, లైటింగ్ ఏర్పాటు చేశారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్‌తోపాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.
రామగిరి, సెప్టెంబర్ 16 : మతం కంటే మానవత్వం ముఖ్యమని, మత సామరస్యానికి నల్లగొండ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పాతబస్తీ హనుమాన్‌నగర్‌లోని ఒకటో నెంబర్ గణేశ్ విగ్రహం వద్ద ఆయన పూజలు చేసి శోభయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల్లో ఉత్సవాల వేళ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకపోవడం ఇక్కడి ప్రజల్లోని సోదరభావానికి నిదర్శనమన్నారు. వినాయక నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రూ.2వేల కోట్లతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని 6లైన్లకు విస్తరించే పనులకు త్వరలోనే కేంద్ర మంత్రి గడ్కరీతో శంకుస్ధాపన చేయించనున్నట్లు చెప్పారు.