సూర్యాపేట, ఫిబ్రవరి 16(నమస్తేతెలంగాణ)/నల్లగొండ : తెలంగాణ ఉద్యమ సారధి, స్వరాష్ట్ర సాధకుడు, అభివృద్ధి కాముకుడు, బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 71వ జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు పుట్టిన రోజు వేడుకలను పెద్దఎత్తున నిర్వహించేందుకు సిద్ధం చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రక్తదాన శిబిరాల ఏర్పాటు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల్లో అన్నదానం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేయనున్నారు.
ఇక కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన హారితహారానికి కొనసాగింపుగా పలుచోట్ల మొక్కలు నాటి వృక్షార్చనలో భాగస్వామ్యం అయ్యేందుకు సన్నద్ధమయ్యారు. కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల బీఆర్ఎస్ అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్, బడుగుల లింగయ్యయాదవ్, కంచర్ల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, కలెక్టరేట్ల వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించాలని, కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయాలని కోరారు.
యాదగిరి గుట్ట ఆలయం నుంచి యాదాద్రి థర్మల్ ప్లాంట్ వరకు..
మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పాల్గొననున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఇందులో భాగస్వామ్యం కానున్నారు. తొలుతగా ఉదయం ఏడు గంటలకు యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో జగదీశ్‌రెడ్డి పాల్గొంటారు. అనంతరం ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఏర్పాటు చేసిన స్థానిక కార్యక్రమాలకు హాజరవుతారు.
ఆ తర్వాత ఉదయం 8 గంటలకు భువనగిరి పట్టణంలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ ముందు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నల్లగొండలో ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలో నిర్మించిన మెడికల్ కళాశాల ముందు స్థానిక మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో, 11.30 నిమిషాలకు మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలంలోని వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ థర్మల్ కేంద్రం ముందు స్థానిక మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరవుతారు.