నల్లగొండ, నవంబర్ 25: నల్లగొండలో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. దీక్షా దివస్ విజయవంతం కోసం గురువారం స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్-29వ తేదీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన రోజని.. ప్రతి తెలంగాణ వ్యక్తి దీక్షా దివస్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నాటి సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ అనే పదం ఉచ్ఛరించేందుకు కూడా భయపడే రోజుల్లో కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి, తెలంగాణ నినాదం మార్మోగేలా చేశారన్నారు. కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రే కాకుండా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
తెలంగాణ వాళ్ల దిష్టి తగిలి ఏపీలోని కోనసీమలో కొబ్బరి చెట్లు నాశనమయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడంపై జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ తెలంగాణ ప్రజలు ఎవరి నాశనాన్ని కోరుకోరని..అట్లా కోరుకుంటే ‘అరవై ఏండ్లు మా సొమ్ము దోచుకుతిన్న మీరు ఎప్పుడో నాశనమయ్యేవారు’ అని అన్నారు. ఎవరి నాశనం కోరుకోవద్దని కేసీఆర్ తమకు నేర్పినట్లు తెలిపారు. మోదీ, చంద్రబాబు, రేవంత్ లాంటి వారు ఎన్ని కుట్రలకు పాల్పడినా కేసీఆర్‌ను దెబ్బకొట్టలేరని అన్నారు.
భూములతో పాటు నదీ జలాలు దోచుకుంటున్నా పట్టించుకోని పాలకులు..
రాష్ట్రంలో రెండేండ్లుగా సమైక్య పాలన కొనసాగుతోందని..చంద్ర బాబు ఏజెంటే ఇక్కడ, అక్కడి ప్లాన్లు అమలు చేస్తున్నాడని జగదీశ్‌రెడ్డి విమర్శలు చేశారు. హైదరాబాద్‌లోని రూ. లక్షల కోట్ల విలువైన భూములను ఆంధ్రోళ్ల వద్ద కమీషన్లు తీసుకొని తక్కువ ధరకు ధారాదత్తం చేస్తూ సీఎంతో పాటు మంత్రులు వాటాలు పంచుకుంటున్నారని దుయ్యబట్టారు. భూములతో పాటు గోదావరి, కృష్ణానదీ జలాలను కూడా దోచుకు పోతున్నా పట్టించుకోక పోవటంతో తెలంగాణ రైతులకు సాగు నీరు అందని పరిస్థితి నెలకొందన్నారు.
అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలు బాధ్యతతో శనివారం నల్లగొండలో నిర్వహంచే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నలమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, తిప్పన విజయ సింహా రెడ్డి, నోముల భగత్ కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రాంచంద్ర నాయక్, పల్లె రవికుమార్, చెరుకు సుధాకర్, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మందడి సైదిరెడ్డి, కడారి అంజయ్య, ప్రసన్న రాజ్, సోమన్న తదితరులు పాల్గొన్నారు.