నీలగిరి, జూన్ 13: ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరఫు బూత్ ఏజెంట్లు బీఎల్‌ఓలతోపాటు ఇల్లిల్లూ తిరుగుతూ అందరి ఓట్లు కాపాడుకునేలా పకడ్బందీగా పనిచేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా సభ్యత్వ ఇంచార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో నల్లగొండ నియోజవర్గ ప్రత్యేక ఓటరు జాబితా పరిశీలన (సర్), పార్టీ డిజిటల్ సభ్యత్వాలపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అంతకుముందు జగదీశ్‌రెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఇంటింటి గణనను అత్యంత సీరియస్‌గా తీసుకోవాలన్నారు. జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎకడైనా పొరపాట్లు ఉంటే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ సవరించుకోవాలని సూచించారు. కార్యకర్తలు ఎప్పటి కప్పుడు ఆర్డీవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ఓటరు జాబితాలో జరిగే చిన్న పొరపాటు కూడా ఎన్నికల ఫలితాలను మార్చగలవన్నారు. అందువల్ల ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రతి కార్యకర్త సీరియస్‌గా తీసుకొని, అర్హులైన ఓటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రతి బూత్‌కు పార్టీ క్యాడర్‌ను రెండు విభాగాలుగా విభజించి సర్ ఏజెంట్లు, డిజిటల్ సభ్యత్వాలను వేరుచేసి అవగాహన కల్పించారు.

సర్ ప్రక్రియ కీలకం..ఆర్ఎస్ ప్రవీణ్
ముందుగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇంచార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సర్ ప్రక్రియ చాలా కీలకమైనదన్నారు. ఓట్లతో అధికారంలోకి రాలేమని బీజేపీ అడ్డదారిన సర్ ద్వారా ఓట్లను తొలగించి, వివిధ రాష్ర్టాల్లో అధికారంలోకి వస్తోందన్నారు. మొన్న జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో అస్సాంలో సర్ పక్రియ చేపట్టకుండా బెంగాల్లో చేపట్టి ఎన్నికలు నిర్వహించారన్నారు. బెంగాల్లో 95 లక్షల ఓట్లను తొలగించి అధికారంలోకి వచ్చారన్నారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా రెండు కోట్ల ఓటర్ల పేర్లు తొలగించారన్నారు.
తమిళనాడులో సైతం అదే పద్ధతి పాటించి స్టాలిన్‌ను ఓడించారన్నారు. తెలంగాణలో కూడా సర్ చేపట్టి అడ్డదారిలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ప్రతి ఒక్కరూ సర్ ప్రక్రియపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నల్లగొండ నియోజకవర్గాన్ని రూ.వందల కోట్లతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తే డబుల్ ఓట్ల కారణంగా ఇక్కడ పార్టీ ఓడిపోయిందన్నారు. సర్ ప్రక్రియ విషయంలో అప్రమత్తంగా లేనందునే కేంద్ర మాజీ మంత్రి సృ్మతీ ఇరానీ సైతం తన ఓటును కోల్పోయారన్నారు. తన నామినేషన్ తిరస్కరణపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సుప్రీం కోర్టుకు వెళ్లినా ఊరట దొరకలేదన్నారు. ఎన్నికల సంఘానికి ఎంత పవర్ ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్ సీఎం కావాలంటే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త బీఎల్వో, ఎస్ఐఆర్పై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని ఆయన చెప్పారు.
హ్యాం రోడ్ల పేరుతో స్కామ్ చేసేందుకే
ఈ నెల 17న పెద్ద సామ్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నల్గొండకు వస్తున్నాడని గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఖజానాలో 13 పైసల్లేవు.. టెండర్లు పిలవలేదు.. కానీ కమీషన్ల కక్కుర్తితో హ్యాం రోడ్లు అంటూ ప్రారంభోత్సవాలు చేసేందుకు సీఎం వస్తున్నాడని విమర్శించారు. కమీషన్ల కోసమే హ్యాం రోడ్లపై హంగామా అని అన్నారు. జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, జనాన్ని మోసగించేందుకు డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు.
జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులూ అసమర్థులేనన్నారు. సీఎంగా కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతీసారి నల్గొండను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఫ్లోరిన్ సమస్యను తరిమివేశారని, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలకు మెడికల్ కళాశాలలు, రూ.13 వందల కోట్లతో నల్లగొండ అభివృద్ధి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ మంజూరు చేశారన్నారు. మిల్లర్ల వద్ద మూడుపులు తీసుకున్న దుర్మార్గులు జిల్లా మంత్రులని విమర్శించారు. కోమటిరెడ్డి మంత్రి పదవి పోయేలా ఉందని, దానిని కాపాడుకునేందుకు రేవంత్‌ను కాకా పట్టేందుకు సభ పెడుతున్నారన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా మరోసారి ప్రజలను నేరుగా కలిసే అవకాశం వచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రత్యక్షంగా ఓటర్లను కలవాలన్నారు.
సీఎం సభను అడ్డుకుంటాం..కంచర్ల
నియోజవర్గ ప్రజలను మోసగించేందుకు మళ్లోసారి నల్లగొండ పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. 1200 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తే రెండున్నరేండ్లు అవుతున్నా లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారని విమర్శించారు. కమీషన్ల కక్కుర్తితో 17న నల్లగొండకు వస్తున్న సీఎంకు రైతులు, ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. జిల్లాలో వ్యవసాయ పనుల సీజన్ ప్రారంభమవుతున్నా ఎరువులు, యూరియా అందుబాటులో లేవని, ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదని అవేదన వ్యక్తం చేశారు.
సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే జిల్లాకు రావాలని, లేకుంటే పర్యటనను కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడుతున్న కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని, భవిష్యత్తు బీఆర్ఎస్దేనని అన్నారు. కార్యకర్తలు ఐక్యతగా ఉండి కేసీఆర్‌ను సీఎం చేసేందుకు పని చేయాలన్నారు. సొంత గ్రామంలో ఓటు ఉండి ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఏదో ఒకచోట ఉండేలా చూడాలన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ కంచర్ల కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, గ్రంథాయల మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, ఐసీడీఎస్ మాజీ ఆర్వో మాలే శరణ్యారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నిరంజన్ వలీ, పార్టీ నాయకులు బోనగిరి దేవేందర్, దేప వెంకట్‌రెడ్డి, అయితగోని యాదయ్య, పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, కార్పొరేటర్లు మారగోని భవానీ గణేష్, మందడి లిఖితా సైదిరెడ్డి, దీప్లా నాయక్, దొడ్డి రమేష్, పెరిక యాదయ్య, కుందూరు దీపికాప్రవీణ్ కుమార్‌రెడ్డి, గోపగాని స్వాతీ రాజశేఖర్, పేర్ల మహేశ్వరి ఆశోక్చంద్ర, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు కొండూరు సత్యనారాయణ, అభిమన్యు శ్రీనివాస్, సింగం లక్ష్మి, దండెంపల్లి సత్తయ్య, గుండెబోయిన జంగయ్య ఉన్నారు.
భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు
నల్లగొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి గ్రామంతో పాటు పట్టణంలోని డివిజన్ల బూత్ స్థాయి నుంచి కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రతీ బూత్ నుంచి ఇద్దరు చొప్పున రావాలని పిలుపునివ్వడంతో దాదాపుగా నాలుగు నుంచి ఐదుగురు కార్యకర్తలు తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా పది గంటల నుంచే కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయమంతా బీఆర్ఎస్ కార్యకర్తలతో నిండిపోయింది. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.