నల్లగొండ ప్రతినిధి, మే1(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఎల్కతుర్తి బహిరంగ సభకు తరలివచ్చిన లక్షలాది మంది జనాన్ని చూసి కాంగ్రెస్ నేతల వెన్నులో వణుకు మొదలైందని, అందుకే సభ సక్సెస్‌ను జీర్ణించుకోలేక అక్కసు వెళ్లగక్కుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా మంత్రులు మతి తప్పి ఏదేదో మాట్లాడుతున్నారని, అవాకులు చవాకులు పేలుతున్నారని ఎద్దేవా చేశారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి దమ్ముంటే పదేండ్లలో జరిగిన జిల్లా అభివృద్ధిపై ప్రజల్లోనే చర్చ పెడుదాం, అందుకు సిద్ధ్దం కావాలని సవాల్ విసిరారు. కృష్ణా జలాలను వినియోగించ లేక, సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకుండా జిల్లాను ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్ నేతలదని విమర్శించారు. గురువారం నల్లగొండలో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో కాంగ్రెస్ నేతల తీరుపై జగదీశ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.
దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ నేతలు జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని పెంచి పోషిస్తే పదేండ్ల కేసీఆర్ పాలనలో ఫ్లోరైడ్‌ను తరిమికొట్టిన చరిత్ర తమదన్నారు. ఏండ్ల తరబడి సూర్యాపేట ప్రజలు మూసీ మురికి నీళ్లే తాగునీరంటూ తాను మంత్రిగా సూర్యాపేట ప్రజలకు స్వచ్ఛమైన కృష్ణా జలాలను అందించానని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నడూ 4 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించిన చర్రిత జిల్లాకు లేదని, కానీ తమ పదేండ్ల పాలనలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి రాష్ర్టానికే జిల్లాను తలమానికంగా నిలిపిన చరిత్ర కేసీఆర్ సర్కార్‌ది పేర్కొన్నారు.
కృష్ణా జలాల వాటాను కూడా వాడుకోలేని దద్దమ్మలు ఆనాటి కాంగ్రెస్ పెద్దలన్నారు. బీఆర్ఎస్ హయాంలో చివరి భూముల వరకు నీళ్లు పారిస్తూ… ఎకరా పంట కూడా ఎండకుండా నీళ్లిచ్చామని గుర్తుచేశారు. ఈ ఏడాది నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా నీళ్లను ఏపీ సర్కారు తరలించుకుపోతుంటే ఇక్కడ సీఎంగా ఉన్న చంద్రబాబు శిష్యుడు కండ్లు అప్పగించి చూశాడంటూ మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాను పాలన సౌలభ్యం కోసం మూడు జిల్లాలుగా చేసి, జిల్లాకు ఒక మూడు మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో ఉమ్మడి జిల్లాలో ఎన్నో అద్భుతాలు చేసి చూపామని తెలిపారు. దశాబ్దాలుగా జిల్లాను పాలించిన కాంగ్రెస్ నేతలు పొట్టలు పెంచుకుని జేబులు నింపుకోవడంపైనే దృష్టి పెట్టారని, జిల్లా ప్రయోజనాలను గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక, ప్రజల్లో ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. అసెంబ్లీలో ఇష్టమొచ్చినట్లు బూతులు మాట్లాడి పరువు తీసుకున్నారన్నారు.
ముమ్మాటికీ కాంగ్రెస్సే విలన్
తెలంగాణకు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీనే విలన్ అని సభలో కేసీఆర్ చెప్పడం కాంగ్రెస్ నేతలకు జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఆది నుంచి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టం చేశారు. తెలంగాణలో రాహుల్‌గాంధీ పెట్టిన సభలో బీఆర్ఎస్ సభలో పల్లీ బఠానీలు అమ్ముకున్నంత జనం కూడా లేరని పేర్కొన్నారు. ఇలాంటి సభలు బీఆర్ఎస్, కేసీఆర్‌కే సాధ్యమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని ప్రజలు పట్టించుకోవడం లేదని, ఆయన పేరు కూడా గుర్తు ఉండడం లేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని, వాళ్లకు వాళ్లే కూల్చేసుకుంటారని తెలిపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే సీఎం మార్పు అంశాన్ని తెరపైకి తెస్తున్నారని చెప్పారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారే గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా కేసీఆర్ గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారని, ఆయన పొద్దుతిరుగుడు పువ్వు లాంటి వ్యక్తి అని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మందడి సైదిరెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఘనంగా మేడే..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. గురువారం మేడేను పురస్కరించుకుని వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేశారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఆటో యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అడ్డాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి బీఆర్ఎస్కేవీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల ఐక్యతతో గతంలో ఎన్నో సాధించుకున్నామని, ఏ రంగంలో పని చేసే కార్మికులైనా ఐక్యతను పెంచుకోవాలని పిలుపునిచ్చారు.