బీబీనగర్, అక్టోబర్ 17: ఎయిమ్స్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డికి హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ర్టాల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ లేఖ రాశారు. ఈనెల 13న ఎయిమ్స్‌ను సందర్శించి అధ్యాపకులు, విద్యార్థులు, రోగులతో మాట్లాడారు. తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రికి సూచనలు చేస్తూ లేఖ పంపారు. కేంద్ర, రాష్ట్ర సహకార సమాఖ్య స్ఫూర్తితో బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి అవుతుందని, ప్రతి ఏటా ఒక మిలియన్ పేషెంట్లకు సేవలందించనుందని, తెలంగాణలో ఆధునిక ఆరోగ్యసేవలకు కేంద్ర బిందువుగా అవతరిస్తుందన్నారు.
నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్ (ఎన్ఐఆర్ఎఫ్)లో అత్యున్నత ర్యాంక్ సాధించనుందన్నా రు. హైదరాబాదు-వరంగల్ జాతీయ రహదారి 163కు ఆనుకొని ఎయిమ్స్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 200 ఎకరాలను కేటాయించిందన్నారు. ఎంబీబీఎస్ తొలి బ్యాచ్ విద్యార్థులు ఇటీవలే గ్రాడ్యుయేట్ పూర్తి చేశారన్నారు. బీబీనగర్ చుట్టూ మౌలిక సదుపాయాలు కల్పించాలని, 163 జాతీయ రహదారిపై ప్రతినిత్యం 250కి పైగా బస్సులు నడుస్తున్నాయని, వాటికి ఎయిమ్స్ ఆవరణలో స్టాప్ ఏర్పాటు చేసి సర్వీసు రోడ్డు ద్వారా ప్రయాణించేటట్లు ఆర్టీసీని ఆదేశించాలన్నారు.
ఘట్కేసర్ నుంచి బీబీనగర్ ఎయిమ్స్‌కు సిటీ బస్సుల సేవలు విస్తరించాలన్నారు. ఎంఎంటీఎస్ పొడిగింపు, బస్ డిపో ఏర్పాటు, ఎలక్ట్రిక్ వాహన వంటి సేవలు కల్పించాలన్నారు. ఎయిమ్స్‌లో అధునాతన అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని, శిక్షణ పొందిన అగ్నిమాపక సిబ్బందిని నియమించాలని సూచించారు. సిబ్బంది కుటుంబాలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఎయిమ్స్ సమీపంలో సెంట్రల్ లేదా ప్రైవేట్ సూల్ జోన్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్ పౌర, పరిపాలనా సౌకర్యాల సమన్వయ అభివృద్ధికి ఎయిమ్స్ అధికారులతో కలిసి పనిచేయాలన్నారు. రోడ్లు, భవనాలు, రెవెన్యూ, మున్సిపల్, విద్య, అగ్నిమాపక సేవల విభాగాలతో ఉమ్మడి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఎయిమ్స్ బీబీనగర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రయోజనకరం గా ఉందని, ఎన్‌హెచ్ 163, ఎన్‌హెచ్ 191పీ, బీబీనగర్ రైల్వే జంక్షన్ ద్వారా అద్భుతమైన రవాణా సదుపాయాలు కల్పించాలన్నారు.