నీలగిరి, అక్టోబర్ 5: ఖాళీ జాగాలో ఇసుక కనిపించిందా.. ఎక్కడైన ముగ్గు పోశారా.. వెంటనే స్థానిక నాయకులు వాలిపోతున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పినా.. నిబంధనల ప్రకారం నిర్మాణం చేపడుతున్నామని చెప్పినా కూడా వదలరు.. చెప్పిన కాడికి ముట్టజెప్పాల్సిందే..లేకుంటే అధికార యంత్రాంగాన్ని ప్రయోగిస్తారు.. అన్ని అనుమతులు ఉన్నా చుట్టుపక్కల వారిని రెచ్చగొట్టి నిర్మాణ పనులకు అడ్డుకుంటున్నారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. సామాన్యులపై ఆధిపత్యం చెలాయిస్తూ అందినకాడికి దండుకుంటున్న ఈ తతంగమంతా నల్లగొండలోనే జరుగుతోంది. నల్లగొండ ప్రకాశం బజార్లో గడాలే విజయ తన తాతల కాలం నుంచి(1959) వారసత్వంగా వచ్చిన భూమి లో ఉంటున్నారు. తాత, మామ, భర్త కూడా అక్కడే ఉండేవారు.
వారసత్వంగా వచ్చిన 700 గజాల భూమిలో ఇటీవల నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ప్రస్తుత అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ భర్త గత ఎన్నికల్లో తనకు ప్రచారం చేయలేదని కక్ష పెంచుకున్నాడు. ఇదే అదునుగా భావించి రూ.కోట్ల విలువజేసే భూమిలో కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపడుతున్నారని, అందులో తన వాటాగా రూ. పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని అనుమతులు ఉన్న తాము ఎందుకు డబ్బులు ఇవ్వాలని విజయ కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. దీంతో సదరు వ్యక్తి మీరు ఎలా కాంప్లెక్స్ కడతారో చూస్తానంటూ బెదిరించాడు. దీంతో వారు చేసేది లేక మధ్యేమార్గంగా రెండు లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అయినా కూడా శాంతించని సదరు మాజీ ప్రజాప్రతినిధి ఎలాగైనా పదిలక్షలు వసూలు చేయాలని భావించి.. పక్కనే ఉన్న మరో ఇంటి యాజమానిని కలుపుకొని తన భూమిలో ఇల్లు నిర్మిస్తున్నారంటూ ఫిర్యాదు చేయించాడు.
అయితే అధికారులు పత్రాలను పరిశీలించి విజయ ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, ఫిర్యాదు చేసిన వ్యక్తికి అసలు డాక్యుమెంట్లే లేవని తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో తోచని మాజీ ప్రజాప్రతినిధి తన ఇంటికి అడ్డుగా ఇల్లు కడుతున్నారంటూ మరోమారు పంచాయితీ పెట్టించాడు. మున్సిపల్ నిబంధనలు, డాక్యుమెంట్ల ప్రకారం విజయ నిర్మాణ పనులు చేస్తున్నట్లు చెప్పినా వినకుండా అర్ధరాత్రి అనుచరులతో వచ్చి మహిళ అని చూడకుండా దౌర్జన్యానికి దిగి, నిర్మాణం చేపట్టిన ప్రహరీని నేలమట్టం చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు చూసీచూడనట్లు వెళ్లిపోయారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉండగా అదివారం మరో మైనార్టీ నేత రంగంలోకి దిగారు. మాజీ కౌన్సిలర్ చెప్పినట్లు రూ.పది లక్షలు ఇవ్వాల్సిందేనని లేకుంటే ఐదు ఫీట్ల పక్కింటోడికి ఇవ్వాలని లేకుంటే కాంప్లెక్స్‌ను నేలమట్టం చేస్తామని ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంపై బాధితులు పోలీసులకు షిర్యాదు కూడా చేశారు.
నిబంధనల ప్రకారమే నిర్మాణం
మున్సిపాలిటీ నుంచి అన్ని రకాల అనుమతు లు తీసుకుని నా కుమారులు కాంప్లెక్స్ కడుతున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేని వాళ్లు వచ్చి బెదిరిస్తున్నారు. పది లక్షలు ఇవ్వాలని, లేకుంటే ఐదు ఫీట్ల జాగా వదలాలని బెదిరిస్తున్నారు. పది లక్షలు మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి.. ఇదెక్కడి న్యాయం..
-జి. విజయ, బాధితురాలు