యాదగిరిగుట్ట, ఏప్రిల్11: అవినీతి, అసమర్థత కారణంగా నార్ముల్ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డిపై ఆవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్న డైరెక్టర్లు, అదే చైర్మన్‌కు డబ్బులకు అమ్ముడుపోయి అవిశ్వాసాన్ని విరమించుకున్నారని నార్ముల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి ఆరోపించారు. ఒక్కో డైరెక్టర్‌కు రూ. 5 లక్షలు చైర్మన్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతుందని తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలోని గొంగిడి నిలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాడి రైతులకు 6 బిల్లులు పెండింగ్‌లో పెట్టి, చైర్మన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్‌కు చెందిన 13 మంది డైరెక్టర్లు యాదగిరిగుట్ట రెడ్డి సత్రంలో రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు.
చైర్మన్‌ను వెంటనే గద్దె దింపాలని, ఆయన తీరుతో సంస్థ తీవ్ర నష్ర్టాల్లో కూరుకుపోతుందని స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు ఫిర్యాదు చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేతో సమావేశం అనంతరం డైరెక్టర్లు ఎందుకు మాట మార్చోరా సమాధానం చెప్పాలని అన్నారు. సంస్థ ఎన్నికల సమయంలో నార్ముల్‌కు ఉన్న పెండింగ్ బిల్లులు అందజేయడంతోపాటు ప్రభుత్వం తరపున రూ. 30 కోట్ల గ్రాంట్లు మంజూరు చేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చెప్పారని, కానీ ఇంతవరకూ అతీగతి లేదని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా నార్ముల్ సంస్థకు ఒక్క రూపాయి మంజూరు చేయలేదన్నారు. రోజుకు 40 వేల లీటర్ల పాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించి రోజువారీగా డబ్బులు చెల్లిస్తున్న చైర్మన్‌కు పాల సంఘాల ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. అవినీతిగా పేరొందిన గుడిపాటిని కొనసాగిస్తారా? లేక వేరే వ్యక్తిని నియమిస్తారో ప్రభుత్వ ఇష్టమని, కానీ పాడి రైతులకు పెండింగ్‌లోఉన్న 6 బిల్లులు, ఉద్యోగులకు జీతాలను వెంటనే మంజూరు చేయాలని కోరారు. వారంరోజుల్లో సానుకూల స్పందన రాకపోతే సంస్థకు పాలను విక్రయించబోమని 400 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల నుంచి నోటీసులు ఇచ్చి, నార్ముల్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నార్ముల్ డైరెక్టర్ కందాల అలివేలరంగారెడ్డి, మాజీ డైరెక్టర్లు దొంతిరి సోమిరెడ్డి, ఒగ్గు భిక్షపతి, పాల సంఘం చైర్మన్లు మైదం రంగన్న, సతీశ్‌రెడ్డి, రాములు, సురేశ్ పాల్గొన్నారు.