– 17 షాపులకు నోటీసులు జారీ
నల్లగొండ రూరల్, అక్టోబర్ 21 : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా జోనల్ అధికారి వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఆహార భద్రత శాఖ అధికారులు నల్లగొండలోని స్వీట్స్ షాపులు, స్పైసెస్ తయారీ కేంద్రాలు, రీటైల్ యూనిట్స్పై మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 12 స్వీట్స్ తయారీ కేంద్రాలు, 7 స్పైసెస్ తయారీ, రిటైల్ కేంద్రాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను ఉపయోగించి స్పాట్ టెస్ట్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వంట గదుల్లో పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్ల తయారీ, పసుపు, కారం ఇతర మసాలా పొడులను ప్రాసెస్ చేయడం, ఫుడ్ హ్యాండ్లర్స్ హెయిర్ క్యాప్స్, గ్లౌజులు ధరించక పోవడం, పురుగులతో, నాణ్యత లోపించిన ముడి సరుకులు ఉపయోగించడం, గోడలు, పైకప్పు పై నూనెతో కూడినటువంటి దుమ్ము ధూళి పేరుకు పోవడం వంటివి గుర్తించి సంబంధిత 17 స్వీట్ షాప్, స్పైసెస్ దుకాణదారులకు నోటీసులు జారీ చేయడం జరిగింది.
హానికర రసాయనాలతో కూడినటువంటి రంగులతో చేసినటువంటి సుమారు 48 కిలోల స్వీట్లు, తయారీలో కాలం చెల్లిన ఆహార పదార్థాలను, 5 కిలోల పురుగులు పట్టిన ధనియాల పొడిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. సుమారు 90 కిలోల లేబుల్ లేనటువంటి ఆహార పదార్థాలను, 50 కిలోల పురుగులతో కూడినటువంటి మైదా పిండిని సీజ్ చేసి, 27 అనుమానిత శాంపిల్స్ ను పరీక్ష కోసం ల్యాబ్ కు పంపారు. నివేదిక ఆధారంగా ఆహార కల్తీ నిర్ధారణ అయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జ్యోతిర్మయి తెలిపారు. ఆహార కల్తీకి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఇకపై ఇలాంటి స్పెషల్ డ్రైవ్స్ తరచూ నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Nalgonda Rural : నల్లగొండలోని స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు