నల్లగొండ రూరల్, జనవరి 24 : చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఆహార పరిరక్షణ శాఖ అధికారులు చెరువుగట్టులో భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన అన్నప్రసాదం అదేవిధంగా ఆహార పరిరక్షణ పర్యవేక్షణ తనిఖీలను శనివారం సాయంత్రం నిర్వహించారు. పర్యవేక్షణ తనిఖీలలో భాగంగా ఆలయ ఈఓ, ఆలయ సిబ్బందితో కలిసి ఆహార పరిరక్షణ శాఖ అధికారులు ఆలయ ప్రసాదం తయారీ కేంద్రాన్ని సమగ్రంగా తనిఖీ చేశారు. ప్రసాదం తయారీకి సంబంధించిన ముడి పదార్థాల స్వీకరణ, నిల్వ విధానాలు, తయారీ ప్రక్రియలు, పరికరాల శుభ్రత, నీటి వినియోగం, వ్యర్థాల నిర్వహణ, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత తదితర అన్ని అంశాలను సవివరంగా పరిశీలించారు.
భక్తులకు అందిస్తున్న లడ్డూ, పులిహోరలను బ్యాచ్ వారీగా తనిఖీ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ మొబైల్ ప్రయోగశాల ద్వారా తక్షణ స్పాట్ పరీక్షలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా గమనించిన లోపాలు, మెరుగు పరచాల్సిన అంశాలను నమోదు చేసి, ఆహార భద్రత, పరిశుభ్రతను మరింత మెరుగుపరచేందుకు అవసరమైన పరిశీలనలు, సవరణ చర్యలను చేపట్టాలని ఆలయ ఈఓకు సూచించారు. అలాగే ప్రసాదం తయారీ కేంద్రాల నిర్వాహకులు, సిబ్బందికి ఆహార తయారీ సమయంలో అనుసరించాల్సిన ప్రామాణిక విధానాలు, పరిశుభ్రత, శానిటేషన్, భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు.

Nalgonda Rural : చెరువుగట్టు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆహార పరిరక్షణ పర్యవేక్షణ తనిఖీలు
అదేవిధంగా, ఆలయ పరిసరాలలో ఉన్న తినుబండారాలు విక్రయించే వ్యాపారులను కూడా తనిఖీ చేసి, ఆహార భద్రతకు సంబంధించిన సూచనలు అందజేశారు. కొన్ని ఆహార పదార్థాల నమూనాలను సేకరించి, ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ద్వారా స్పాట్ పరీక్షలు నిర్వహించడంతో పాటు, మరింత పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. ఈ సందర్భంగా నాసిరకమైన, కల్తీకి లోనయ్యే అవకాశం ఉన్న ఆహార పదార్థాలను విక్రయించకుండా, నాణ్యమైన మరియు సురక్షితమైన ఆహార పదార్థాలను మాత్రమే విక్రయించాలని వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహారం, అన్నప్రసాదం అందే విధంగా ఆహార పరిరక్షణ శాఖ ఈ పర్యవేక్షణ తనిఖీలను నిరంతరం కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు.
బ్రహ్మోత్సవాల కాలమంతా ఆహార నాణ్యతపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. ఆలయ పరిసర ప్రాంగణంలో విక్రయదారులు నిషేధిత పదార్థాలను, హానికరమైనటువంటి రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలను విక్రయించవద్దని, గుట్కా పొగాకు లాంటివి నమిలి ఆలయ పరిసర ప్రాంతాలను అపరిశుభ్రం చేయకూడదని ఒకవేళ ఇలాంటి నిబంధనలను ఉల్లంఘించిన ఎడల ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టం ప్రకారం కఠినంగా శిక్షించబడతారన్నారు.

Nalgonda Rural : చెరువుగట్టు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆహార పరిరక్షణ పర్యవేక్షణ తనిఖీలు