ఉపాధి కూలీలకు చేతినిండా పని నకిరేకల్ వివిధ గ్రామాల రైతులు చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తమ వ్యవసాయ భూముల్లో ఉపాధి హామీ కింద చేపల చెరువుల నిర్మాణం చేపడుతున్నారు. హామీ జాబ్‌కార్డు కలిగిన సన్నకారు రైతులకు ఖర్చు లేకుండా ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద రూ.5లక్షలకు పైగా నిధులతో చేపల చెరువులు నిర్మిస్తుండడంతో రైతులు ఆసక్తిగా ముందుకొస్తున్నారు.
– నకిరేకల్, ఏప్రిల్ 23
9 చెరువుల నిర్మాణం.. మరో 6 దరఖాస్తులు
నకిరేకల్ మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో గత సంవత్సరం రైతులు తమ వ్యవసాయ భూముల్లో చేపల చెరువులు నిర్మించుకున్నారు. ఈ ఏడాది కొత్తగా 6 దరఖాస్తులు వచ్చాయి. చౌడు భూములు, ఎర్ర, నల్లరేగడి నేలలు ఈ చేపల చెరువులకు అనుకూలం. ఎకరం భూమిలో 4 చెరువు గుంతలు నిర్మించుకోవచ్చు. ప్రభుత్వం రూ.5.50లక్షలు, అర ఎకరానికైతే రూ.2.75లక్షలు ఖర్చు చేసి ఉపాధి హామీ కూలీలతో చెరువు గుంతలు తవ్విస్తుంది. రైతులకు నయా పైసా ఖర్చు ఉండదు. దాంతో రైతులకు ఆదాయ వనరుతోపాటు చేతినిండా పని లభించనుంది. 10 గుంటల విస్తీర్ణం గల చెరువులో దాదాపు 2నుంచి 3వేల చేప పిల్లలు, 20 గుంటల చెరువులో 3నుంచి 6వేలకు పైగా చేప వేసుకోవచ్చు. ఏడు, ఎనిమిది నెలల పాటు పెంచితే 800 గ్రాముల నుంచి కిలో వరకు బరువు పెరుగుతాయి. తరువాత అమ్ముకుని ఆదాయం పొందవచ్చు. పెంపకంతో మంచి వస్తున్నదని పేర్కొంటున్నారు.
నియమ నిబంధనలు ఇవే..
1. ఐదెకరాల్లోపు సన్న, చిన్నకారు రైతులు తాసీల్దార్ కార్యాలయం నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి.
2. గ్రామపంచాయతీ తీర్మాన పత్రం ఉండాలి
3. నీటి సౌకర్యం కలిగి ఉండాలి.
4. కనీసం 20 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవు స్థలం ఉండాలి.
5. పట్టాదారు పాసుబుక్, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఆధార్ ఉండాలి.
పైన పేర్కొన్న నిబంధనలు కలిగిన రైతులకు వారం రోజుల్లో చేపల చెరువులు మంజూరు చేసి ఉపాధి హామీ పథకంలో కూలీలతో 30 రోజుల్లో చెరువు గుంత తవ్విస్తారు.
క్షేత్ర పరిశీలన తరువాతే చెరువులు నిర్మించుకోవాలి
చేపల చెరువులు నిర్మించుకోవాలనే రైతులు ముందుగా అనుభవం కలిగిన చేపల చెరువుల రైతులతో క్షేత్ర పరిశీలన చేయాలి. వారి అనుభవాలను తెలుసుకోవాలి. చేపల పెరుగుదలకు సంబంధించి మత్స్యశాఖ అధికారుల సూచనలు తీసుకోవాలి. ఆ తరువాతే చేపలు చెరువులు తీయించుకోవాలి. ఫిష్ పాండ్ చుట్టూ రక్షణ కవచం, తీగలు కట్టి లైట్లు ఏర్పాటు చేసుకోవాలి. మార్కెటింగ్ సౌకర్యం చూసుకోవాలి. చేపల చెరువులో ఎప్పటికప్పుడు నీటి ప్రవాహం లేకుంటే వాటర్ హీటెక్కి చేపలు రోగాల బారిన పడే అవకాశం ఉంది.
– రమణయ్య, ఏపీఓ, నకిరేకల్
రూ. 2.80 లక్షల ఆదాయం వచ్చింది
నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. గతేడాది 30 గుంటల్లో చేపల చెరువు నిర్మించి 5వేల పిల్లలు వేశాను. చేప పిల్లల కొనుగోలుకు, ఫీడింగ్‌కు వాటిని 6నెలల పాటు పెంచినందుకు లక్షల ఖర్చు వచ్చింది. చేపలు అర కిలో వరకు అయ్యాయి. వాటిని అమ్మితే లక్షల వరకు వచ్చింది. ఈ సంవత్సరం ఫంగస్ చేప పిల్లలు వేశా. అవి మూడు కేజీల వరకు పెరిగే అవకాశం ఉంది.
– దాసరి కిశోర్‌రెడ్డి, రైతు, చందుపట్ల