మిర్యాలగూడ, మార్చి 28: వాణిజ్య వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం అవసరమైన రేడియం రిఫ్లెక్టర్ స్టిక్కర్లపై డీలర్/కాంట్రాక్టర్లు నిర్ణయించిన అధిక ధరలు, పరిమిత సరఫరా వ్యవస్థపై సమీక్ష చేయాలని కోరుతూ మిర్యాలగూడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సింగాపురం మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక ఎంవీఐ కార్యాలయం వద్ద అసోసియేషన్ సభ్యులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేడియం రిఫ్లెక్టర్ల కొనుగోలు విషయంలో అమలు చేస్తున్న ప్రస్తుత విధానం వల్ల చిన్న, మధ్య తరహా వాహన యజమానులపై తీవ్రమైన ఆర్ధిక భారం పడుతోందన్నారు. ప్రస్తుతం ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందడానికి రవాణాశాఖ నియమించిన డీలర్/ కాంట్రాక్టర్ల ద్వారా మాత్రమే రేడియం స్టిక్కర్లు కొనుగోలు చేయాల్సి ఉండగా డీలర్లు నిర్ణయించిన ధరలు ఓపెన్ మార్కెట్ ధరలతో పోలిస్తే దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. దీంతో ఒకట్రెండు వాహనాలు కలిగిన చిన్న యజమానులు, స్వయం ఉపాధి పొందుతున్న డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. డీజిల్ ధరలు, ఇన్సూరెన్స్ ప్రీమియం, టోల్ గేట్, టైర్లు, స్పేర్ పార్ట్స్, మెయింటనెన్స్ ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయని, కానీ ఆ మేరకు రవాణా కిరాయిలు పెరగడం లేదన్నారు.
15 సంవత్సరాలకు పైబడిన కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ రెన్యువల్ ఫీజును రూ.1000 నుంచి రూ.30వేల వరకు పెంచడంతో చిన్న, మధ్య తరహా లారీ యజమానులపై తీవ్ర భారం పడుతుందన్నారు. ఫిట్నెస్ రెన్యువల్ ఫీజులను, పెరిగిన రేట్ల ప్రకారం వసూలు చేయకుండా పాత పద్ధతిలో రూ.1000తో ఫిట్నెస్ రెన్యువల్ చేసే విధంగా చూడాలన్నారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్రి సురేష్‌రెడ్డి, కోశాధికారి ఆత్మూరి నవీన్‌కుమార్, అనంతుల నాగరాజు, గార్లపాటి రాంభద్రారెడ్డి, సామునూరి నాగరాజు, తిర్మాని శ్రీను, జిల్లా నగేష్, టేకుల గోవర్ధన్‌రెడ్డి, వరికుప్పల వెంకటేశ్వర్లు, కొనేటి వెంకటయ్య, యల్లంల మల్లేశం, వేముల జానయ్య, వట్టికోటి వెంకన్న, పుల్వాల భాస్కర్‌రెడ్డి, ఎస్కే ఇక్బాల్ పాషా తదితరులు పాల్గొన్నారు.