రామగిరి, ఏప్రిల్ 15 : పేద, మధ్య తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాజమాన్యాలు ఆందోళనలు చేస్తున్న విష యం తెలిసిందే. గతేడాది దసరా నుంచి దశల వారీగా కళాశాలను బంద్ చేపడుతూ, డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరిస్తూ నిరసనలు చేపడుతున్నాయి. ఈ నెల 2 నుంచి జరుగాల్సిన డిగ్రీ సెమిస్టర్ ప్రాక్టికల్, ఈ నెల 11 నుంచి జరుగాల్సిన థియరీ పరీక్షలను బహిష్కరించాయి. కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో మరోమారు ఆందోళనలకు సిద్ధమయ్యాయి.
ఎంజీయూ యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికే వాయిదా వేసిన పరీక్షలను ఈ నెల 17నుంచి నిర్వహించనుండగా వాటిని సైతం బహిష్కరించనున్నట్లు కళాశాలల యాజయాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించే వరకూ పరీక్షల బహిష్కరణ కొనసాగిస్తామని తెలంగాణ అప్లియేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ (టీపీడీపీఎంఏ) నిర్ణయించింది.
ఈ మేరకు మంగళవారం ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి, పరీక్షల నియంత్రణాధికారి జి.ఉపేందర్‌రెడ్డికి వేర్వేరుగా వినతి పత్రాలు అందజేసింది. అంతకు ముందు హైదరాబాద్‌లో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డికి టీపీడీపీఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు, భువనగిరి జాగృతి విద్యా సంస్థల అధినేత బి.సూర్యనారాయణరెడ్డి, ఎంజీయూ చాప్టర్ అధ్యక్షుడు, నీలగిరి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ మారం నాగేందర్రెడ్ది, సంఘం నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు రూ.150 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ సర్కార్ విడుదల చేయాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా బిల్లులు విడుదల చేయకపోవడంతో కరెంట్ బిల్లులు, భవనాల అద్దెలు, జీతాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని టీపీడీపీఎంఏ ఎంజీ యూ చాప్టర్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మారం నాగేందర్‌రెడ్డి, ఎం. సైదారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సైతం ఈ విషయంపై ప్రభు త్వం, సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రామకృష్ణ, పి.భాస్కర్‌రావు, ఎం.వెంకట్‌రెడ్డి, దారిపల్లి ప్రవీణ్, గుండెబోయిన జానయ్యయాదవ్, మహేందర్‌రెడ్డి, హనుమంతు యాదవ్, ధనంజయ్ తదితరులున్నారు.