మిర్యాలగూడ, మే 18 : మిర్యాలగూడ ఎఫ్సీఐ హమాలీ వర్కర్స్ సహకార సంఘం గతంలో కొనుగోలు చేసిన భూమిని జిల్లా సహకార శాఖ అనుమతి లేకుండా అమ్మరాదని జిల్లా సహకార శాఖ అధికారి పత్యానాయక్ ఆదేశాలు జారీ చేసినట్లు ఐఎన్టీయూసీ హమాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు ధనావత్ చిన్నపాండు తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని వెంకటాద్రిపాలెం ఇండస్ట్రీయల్ కాలనీ సమీపంలోని కార్మిక సంఘం భూమిని పరిశీలించి మాట్లాడారు. గతంలో కొనుగోలు చేసిన భూమిని కార్మిక సంఘం సభ్యులు అనుమతి లేకుండా అమ్మకాలు జరిపినట్లు విషయాన్ని జిల్లా కలెక్టర్కు, జిల్లా సహకార శాఖ అధికారికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. విచారణ చేపట్టిన అధికారులు భవిష్యత్లో భూములు అమ్మేందుకు కార్మిక సంఘానికి అవకాశం లేకుండా ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.
హమాలీ కార్మిక సంఘం భూములను ఇకమీదట కొనుగోలు చేసే అవకాశం లేదన్నారు. గతంలో ఏకపక్షంగా జరిపిన అమ్మకాల విషయమై తాను మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఎఫ్సీఐ హమాలీ కార్మిక సంఘం భూముల అమ్మకాల విషయాన్ని సమగ్ర విచారణ జరిపి కార్మికులందరికి న్యాయం చేయాలని కోరారు. అక్రమంగా అమ్మకాలు చేపట్టిన వారిని చట్టపరంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఆయన వెంట శంకర్, మాలోతు శంకర్, తులసీరామ్ ఉన్నారు.