సూర్యాపేట టౌన్, మే 16 : ‘రైతులు, మహిళలు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతోపాటు యువతను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కృత నిశ్చయంతో యువత, ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులంతా ఏకమై పట్టుదలతో పనిచేస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తమకే దక్కుతుంది.’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గురువారం సూర్యాపేటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సూర్యాపేట, హుజూర్నగర్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన అంశాలపై పార్టీ శ్రేణులకు జగదీశ్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ పూర్తిగా విఫలమైందని, వారి వైఫల్యాలే ప్రధాన అస్ర్తాలుగా చేసుకుని ప్రచారంలో దూసుకుపోవాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరుద్యోగులు, యువత ఎండగడుతున్నారని, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి విజయానికి జిల్లాలో సానుకూల వాతావరణం ఉన్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సిద్ధంగా ఉన్న పట్టభద్రుల ఓటర్లందరినీ కలువాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల తరహాలో వారం రోజులు ప్రజాక్షేత్రంలో ఉండి కష్టపడి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశాల్లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఉన్నత విద్యామండలి మాజీ సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.