నేరేడుచర్ల, మే 21 : వానకాలం సమీపిస్తున్నది. కానీ జిల్లాకు అవసరమైన జీలుగ విత్తనాలు ఇప్పటి వరకు రాలేదు. మరో రెండు వారాల్లో వరి సాగు చేసే రైతులు జీలుగ కోసం ఎదురు చూస్తున్నారు. సరఫరా ఆలస్యమైతే సాగు కూడా వెనుకబడుతుందని వారు వాపోతున్నారు. ఎందుకంటే విత్తనాలు చల్లిన 40 రోజులకు పెరిగిన జీలుగ మొక్కలను కలియదున్నాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వరినాట్లు వేసుకోవాలి. జీలుగ విత్తనాలు చల్లడానికి సరైన సమయ ఇదేనని రైతులు అంటున్నారు. కానీ వ్యవసాయ శాఖ మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నది. ఇంకా విత్తనాలు తెప్పించే పనిలోనే ఉంది. గత బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయానికి పెద్ద పీట వేసి రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను సీజన్ ప్రారంభానికి ముందే తెప్పించి సిద్ధంగా ఉంచేది. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సరైన ప్రణాళిక లేక పోవడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు.
సూర్యాపేట జిల్లాలోని రైతులకు కావాల్సిన జీలుగ విత్తనాలను సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ విఫలం చెందుతున్నది. జిల్లాకు 7వేల క్వింటాళ్ల జీలుగు విత్తనాలు అవసరం అని ప్రతిప్రాదనలు పంపించారు. కానీ గత సంవత్సరం 900 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయని, ఈ సారి కూడా 1500 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయని అధికారులు తెలుపుతున్నారు. గత వానకాలంలో జిల్లాలో 4,85,064 ఎకరాల్లో వరి సాగు కాగా ఈ సారి సీజన్లో 4,85,125 ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు 7 వేల క్వింటాళ్ల జీలుగ విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ రాష్ట్ర శాఖకు ఇండెంట్ పంపింది. వాస్తవానికి మే మొదటి వారంలోనే జిల్లాకు ఈ విత్తనాలు సరఫరా కావాలి. కానీ ఇంత వరకూ జిల్లాకు చేరలేదు. మరో పది పదిహేను రోజులు సమయం పట్టే పరిస్థితి కనిపిస్తున్నది.
వ్యవసాయ అధికారులు ప్రతిపాదనలు పంపేది కొండంత అయితే అక్కడి నుంచి వచ్చేది మాత్రం గోరంతే అని పలువురు విమర్శిస్తున్నారు. నేరేడుచర్ల వ్యవసాయ అధికారులు మండలానికి 400 క్వింటాళ్లు జీలుగ విత్తనాలు అవసరం అని ప్రతిప్రాదనలు పంపించగా కేవలం 70 క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపినట్లు తెలిసింది. వచ్చిన విత్తనాలు ఒక్కరోజు కూడా రావని, కార్యాలయానికి వచ్చే రైతులకు ఏ సమాధానం చెప్పాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నతాధికారులు రైతుల గోసను అర్థం చేసుకొని కావాల్సిన విత్తనాలను సరఫరా చేయాలని పలువురు
కోరుతున్నారు.
నేలకు, పంటకు మేలు చేసే పచ్చిరొట్ట ఎరువును తయారు చేసేందుకు ప్రభుత్వం జీలుగ విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందజేస్తూ వస్తున్నది. పట్టాదారు పుస్తకం ఉన్న రైతుకు మాత్రం 50 శాతం వరకు సబ్సిడీపై అందజేస్తుంది. ఈ సారి వానకాలం ఎంత సబ్సిడీపై విత్తనాలు అందజేస్తారనే దానిపై ఇంత వరకు స్పష్టత లేదు. గతంలో ఇచ్చిన విధంగానే 50 శాతం తగ్గకుండా ఇస్తారని అధికారులు పేర్కొంటున్నారు. జీలుగ విత్తనాలు జిల్లాకు వచ్చిన తర్వాతే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సబ్సిడీ ఖరారు అవుతుందని, ఎన్ని సెంటర్లలో పంపిణీ చేస్తామనే విషయం తెలుస్తుంది.