శాలిగౌరారం, మే 5: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి పడిగాపులు కాస్తున్నారు. మా వడ్లు ఎప్పుడు తూకం వేస్తారా..వేశాక తరలించేదెప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మండలంలో వివిధ సంఘాల ద్వారా 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. చిత్తలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రంలో ధాన్యం రాశులు పేరుకు పోయాయి. కొందరు రైతులు 30 నుంచి 40 రోజులుగా కేంద్రంలో వడ్లు పోసి తూకం కోసం వేచి చూస్తున్నారంటే కొనుగోళ్లు ఎలా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు, ఒక్క చిత్తలూరు కొనుగోలు కేంద్రంలోనే కాదు..మిగతా కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటీవల కురిసిన అకాల వర్షానికి రైతులు నానా తంటాలు పడిన విషయం తెలిసిందే.
ధాన్యం కాంటా అయ్యేవరకు ఒక ఎత్తయితే, తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు మరో వారం రోజులు పడుతోంది. తూకం వేసిన బస్తాల వద్ద రాత్రనక పగలనక పడిగాపులు కాస్తున్నా రు. తూకం వేసిన 9 రోజుల వరకు కూడా లారీలు రాకపోవడంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. బస్తాకు 6నుంచి 7 రూపాయలు ఇస్తేనే లారీలు వస్తున్నాయని, అది కూడా అతి కష్టం మీద వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక డ్రైవర్లకు అడిగినంత ఇచ్చి ధాన్యాన్ని లారీల ద్వారా మిల్లులకు తరలిస్తున్నారు.
తూకం వేసి వారం రోజులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో చేసేదేమీలేక బస్తాకు రూ.6 చెల్లించి లారీ తెప్పించాం. తూకం వేసింది ఒక్క ఎత్తయితే, తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అంతకు మించిన భారం అయితోంది. అధికారులు గమనించి రైతులు ఇబ్బందులు పడకుండా లారీలను అందుబాటులో ఉంచి రైతుల కష్టాలు తొలగించాలి.
– దాసరి ప్రసాద్, రైతు, చిత్తలూరు
పగలంతా ఎండ, సాయంత్రం 3గంటల నుంచి మబ్బులు వస్తున్నాయి. మొన్న కురిసిన వర్షానికే నానా ఇబ్బందులు పడి వడ్లను ఎండలో ఆరబోసుకున్నాం..మళ్లీ వర్షం వస్తే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుందోమోననే భయం వేస్తోంది. అధికారులు వెంటనే తూకం వేసి లారీలను రప్పించాలి.
– రామనాధం, రైతు, చిత్తలూరు