నల్లగొండ రూరల్,ఆగస్టు 20: జిల్లాలోని రైతాంగం యూ రియా కోసం నిద్రహారాలు మాని ఎరువుల దుకాణాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. నల్లగొండ మండలానికి సంబంధించిన మూడు ఆగ్రో ఏజన్సీస్లకు, ఎన్డీసీఎంఎస్కు మార్క్ఫెడ్ నుంచి యూరియా సరఫరా చేస్తున్నారు. కొన్ని రోజులుగా యూరియా కొరత తీవ్రంగా ఉంది. బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే రైతులు యూ రియా కోసం పెద్ద సంఖ్యలో నల్లగొండలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్దకు వచ్చారు. నిర్వాహకులు స్టాకు లేదని చెప్పడంతో రైతులు కొద్దిసేపు దుకాణం ఎదుట నిరసన వ్యక్తం చేసి, రోడ్డుపై బైఠాయించారు.
మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్ అక్కడికి వచ్చి ఈరోజు గుండ్లపల్లి ఎక్స్ రోడ్డులోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 20 టన్నులు, కొత్తపల్లి స్టేజీ వద్ద ఉన్న ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్దకు, కొత్తపల్లి ఎన్డీసీఎంస్కు కలిపి 10 టన్నుల యూరియా మధ్యాహ్నం కల్లా వస్తుందని చెప్పడంతో రైతులు అక్కడినుంచి వెళ్లి కొత్తపల్లి, గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఆగ్రోస్ ఏజన్సీ వద్దకు వెళ్లారు. అక్కడ ఏఈవోలు రైతుల ఆధార్ కార్డులోని పేర్లను నమోదు చేసుకొని మధ్యాహ్నం వరకు రమ్మని పంపించారు. అయితే రైతులు సాయంత్రం వరకు పడిగాపులు కాసినా యూరియా రాలేదు. దీంతో వారు ఎంతో నిరాశతో అధికారులు, ప్రభుత్వాన్ని నింది స్తూ వెళ్లిపోయారు.
లోడు రాదు..గోడు తీరదు..
కట్టంగూర్, ఆగస్టు 20: వానలు జోరుగా పడుతుండటంతో సాగు పనుల్లో నిమగ్నమై ఉండాల్సిన రైతులు యూరియా దొరక్కపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా కట్టంగూర్లోని ఎరువుల దుకాణాలతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద యూరియా కోసం పడిగాపులు గాస్తున్నారు. మండలానికి రావాల్సినంత యూరియా రాకపోవడంతో రైతులకు తిప్పలు తప్పడం లేవు.
రెండు రోజులుగా యూ రియా లోడు వస్తుందనే ఆశతో పనులు మానుకొని ఉద యం నుంచి సాయంత్రం వరకు పీఏసీఎస్ కార్యాలయం వద్ద ఎదురు చూసిన రైతులు యూరియా రాకపోవడంతో వెనుదిరుగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియా కొరతే లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరి యా దొరక్క ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులైనా స్పందించి యూ రియా కొరతలేకుండా చూడాలని వారు కోరుతున్నారు.
తెల్లవారుజామున మూడు గంటల నుంచి తిప్పలు
తిప్పర్తి, ఆగస్టు 20: తిప్పర్తి మండలవ్యాప్తంగా యూ రియా కొరత తీవ్రంగా ఉంది. దీంతో రైతులు తిప్పర్తి పీఏసీఎస్ వద్ద తెల్లవారుజామున మూడు గంటల నుంచే పడిగాపులు గాశారు. అయినప్పటికీ పీఏసీఎస్ వద్ద ఉన్న 200 యూరియా బస్తాలను ఒక్కో రైతుకు ఒక్క బస్తా ఇవ్వడం తో తెల్లవారుజామున మూడు గంటల నుంచి క్యూలో నిలబడిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన వందలాది మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు.
రెండు మూడు రోజులుగా వరుసగా యూరియా కొసం రైతులు పీఏసీఎస్ వద్ద బారులుదీరుతున్నా యూరియా దొరక్కపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేసి నెల రోజులవుతోంది. పత్తి, తదితర పంటలకు యూరియా వేసే సమ యం సమీపించింది. అయితే కావాల్సిన యూరియా సమయానికి దొరక్క పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో యూరియా వస్తుందని అధికారులు చెబుతున్నారని పూర్తిస్థాయిలో యూరియాను అందించి రైతులను ఆదుకోవాలని రైతుసంఘాల నాయకులు, రైతులు కోరుతున్నారు.
కేసీఆర్ సారు ఉన్న పదేండ్లలో ఎన్నడూ ఇట్ల బాధపడలే..
ఆరు ఎకరాల పత్తి, రెండెకరాల పొలం పెట్టిన..ఇంత వరకూ పొలంలో, పత్తికి యూరియా ఒక్కసారి కూడా వెయ్యలే. ఆగ్రోస్ ఏజెన్సీకి ఎప్పడొచ్చినా యూరియా ఎప్పుడు వచ్చేది తెల్వదు. ఉంటే ఉండుర్రి.. లేకపోతే లేదు. మాకే క్లారిటీ లేదు.. మీకేం చెప్పం. అంటుండ్రు. సీకటి మొహాన లేచి ఐదు రోజులు కాపలా కాసినం. నీళ్లు లేక..నిప్పులు లేక ..పేగులు మాడపెట్టుకొని..పడిగాపులు కాసినా యూరియా మాత్రం దొరకట్లే. ఇప్పడు ఎవర్ని అంటే ఏం ఫాయిదా. మొదాలు ప్రభుత్వానికి యూరియాను రైతులకు అందించే దమ్ము లేదు. వైఎస్ ఉన్నప్పుడు ఇదే పరిస్థితి.. ఇప్పుడు మళ్లా గట్లనే అయితోంది. కేసీఆర్ సార్ ఉన్న పదేండ్లు గిట్లా ఎన్నడూ యూరియా కోసం బాధలు పడలే.
– గంట్ల సుజాత, రైతు, అన్నెపర్తి
రైతులను ఆదుకోవాలి
ప్రభుత్వ అధికారు లు యూరియా కొ రతను తీర్చి రైతులను ఆదుకోవాలి. తెల్లవారు జాము ను మూడు గంటల నుంచే బారులుతీరినా కొద్ది మందికే యూరియా దొరకడంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు వెంటనే యూరియాను అందించి రైతులను ఆదుకోవాలి.
– నన్నూరి వెంకట్రమణారెడ్డి, రైతు సంఘం నేత
రెండుమూడు రోజుల్లో పూర్తిస్థాయిలో..
మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు 1674 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. పీఏసీఎస్ ద్వారా ఇప్పటి వరకు 240మెట్రిక్ టన్నులను రైతులకు అందించాం. వరుసగా సెలవులు రావడంతో రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో కావాల్సిన యూరియాను పూర్తి స్థాయిలో అందిస్తాం.
– మండల వ్యవసాయ అధికారి సన్నిరాజు