రామగిరి, జూలై 17: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో సంక్షోభం ఏర్పడిందని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ అన్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని ఏచూరి గార్డెన్లో నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ మహాసభ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 36వ అఖిలభారత కిసాన్ సభ మహాసభలు నల్గొండలో నిర్వహించనున్నట్లు చెప్పారు.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షోభం కారణంగా ఐదు లక్షల మంది రైతులు, వలస, వ్యవసాయ కార్మికులు, ఆదివాసి రైతులు, మహిళా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఇందులో అన్ని రాష్ట్రాలు నిజాలు చెప్పడం లేదని విమర్శించారు. సంక్షోభం కారణంగా ఇంకా ఎకువమంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దేశంలో ఆర్థిక సరళీకరణ విధానాలు, అప్పుల కారణంగా ఈ 12 సంవత్సరాల్లో 10 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. 2020 కరోనా సమయంలో లాక్డౌన్ పెట్టి మూడు నల్ల చట్టాలని తీసుకొచ్చారని తెలిపారు. ఢిల్లీలో సంవత్సరానికి పైగా జరిగిన రైతు ఉద్యమం ఫలితంగా ఈ చట్టాలను వెనకి తీసుకున్నారని గుర్తు చేశారు.
బీహార్ ఎన్నికల తర్వాత మళ్లీ ఈ నల్ల చట్టాలను దొడ్డి దారిన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఈ నెల 29న ఢిల్లీలో సంయుక్త కిసాన్ సభ ట్రేడ్ యూనియన్లు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి సదస్సు నిర్వహించనున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న అన్ని రాష్ట్రాల్లో కార్మికుల, రైతులు పది లక్షల మందితో జైల్బరో నిర్వహించనున్నామని అన్నారు. కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాల్లో 736 మంది రైతులు మరణించారని తెలిపారు. అమెరికా, న్యూజిలాండ్, యూరోపియన్ దేశాల నుంచి పత్తి, సోయాబీన్ ఇతర పంటల దిగుమతులపై సుంకాలను తగ్గించారని, దీంతో దేశంలో తీవ్రమైన సంక్షోభం ఏర్పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ నుంచి పాలు దిగుమతి చేసుకోనున్నారని, ఆ పాల ధర లీటరుకు రూ.25 ఉండనుందని చెప్పారు. కేంద్రం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.