చండూరు, ఏప్రిల్ 10 : రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభ్యుత్వం తెలిపిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని చండూరు ఆర్డీఓ శ్రీదేవి అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు సేవా సహకార సంఘం అధ్యక్షుడు & డీసీసీబీ కోడి సుష్మా వెంకన్నతో కలిసి గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్-A కు రూ.2,320/-, గ్రేడ్-Bకు రూ.2,300/- ఉన్నట్లు తెలిపారు.
రైతులు ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చేటప్పుడు రైతు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, భూమి పాస్ బుక్ వెంట తీసుకు రావాలన్నారు. తేమ 17 శాతం లోపు ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. అలాగే రైతులు తమ ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ తప్పకుండా లింక్ చేసుకుని ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ దశరథ, ఏఓ చంద్రిక, ఏఈఓ శోభ, రాకేశ్, సంఘ డైరెక్టర్లు కట్ట భిక్షం, బోడ ఆంజనేయులు, డోలె నర్సాజీ, అచ్చిన శ్రీనివాసులు, చెరుపల్లి ఆంజనేయులు, సంఘ సెక్రటరీ పాల్వాయి అమరేందర్ రెడ్డి, సిబ్బంది, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.