మోతె, జూన్ 04 : రైతుల స్థిరాభివృద్ధికి దోహదపడేలా వికసిత కృషి శిక్షణ నూతన వ్యవసాయ పద్దతులపై దృష్టి సాధించాలని భారత వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ వి.మానస, కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఎ.కిరణ్ అన్నారు. మోతె మండలంలోని సిరికొండ గ్రామంలో బుధవారం రైతులకు సాగులో నూతన సాంకేతిక వినియోగం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు రాపిడ్ మిని సాయిల్ టెస్టు కిట్ ద్వారా మట్టిని పరీక్షించి పోషక లభ్యతను వివరించారు. రసాయన ఎరువులపై ఖర్చు తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం వైపునకు రైతులు మళ్లాలన్నారు. పంట మార్పిడి ఆవశ్యకత, వేసవి దుక్కులు వల్ల కలిగే లాభాలు, సమగ్ర వ్యవసాయ విధానాల ద్వారా అధిక దిగుబడి పొందవచ్చునని తెలిపారు. కేవీకే నందు లభించే వివిధ కూరగాయలు, పండ్ల మొక్కల గురించి వివరించారు.
వివిధ రకాల జీవన ఎరువులు వాడటం వల్ల ఉపయోగం, చెరువు మట్టి తోలడం వల్ల ఉపయోగాలు, పచ్చిరొట్ట పంట ఆవశ్యకత అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. వరి, పత్తి, ఇత పంటల విత్తన ఎంపికలో మెళకువలు, కొనుగోలు సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు. వరి సాగులో వెదజల్లే పద్దతి ద్వారా పెట్టుబడి తగ్గించి దిగుబడి పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త రామకృష్ణబాబు, అరుణ, ఝాన్సీ, రైతులు పాల్గొన్నారు.