ఆత్మకూర్ (ఎస్), మార్చి 9 : ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలని సీపీఎం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుడు దండా వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో పార్టీ సీనియర్ నాయకుడు బెల్లంకొండ చక్రయ్య అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో యాసంగి వరి పంటను సాగుచేసిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఇప్పటికే ఎండిన వరి పంటకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైతులను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న జరిగే కలెక్టరేట్ ముట్టడికి రైతులందరూ హాజరై మద్దతు తెలుపాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కాలంలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ వాటిని నీరుగార్చేలా చేస్తుందని దుయ్యబట్టారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా అందరికీ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పోరాట కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి అవిరే అప్పయ్య, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.