భువనగిరి కలెక్టరేట్, జూన్ 24 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఇందిరమ్మ ఇండ్లు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధులు, ఆయిల్ పామ్, ఎరువులు, భూ భారతి తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు.
ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు పూర్తి చేసేలా ప్రోత్సహించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులను కోరారు. వన మహోత్సవంలో భాగంగా వానకాలం మొదలైనందున మొకలు పెద్ద సంఖ్యలో నాటాలని సూచించారు. మొకలు నాటేందుకు అనువైన ప్రదేశాన్ని చూడాలన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు రైతాంగాన్ని ప్రోత్సహించాలన్నారు.
ఆయిల్ పామ్ సాగు కోసం రైతులకు అవగాహన కల్పించాలన్నారు. భూ భారతి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను వేగవంతంగా పరిషరించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. క్షయ వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహిస్తోందని తెలిపారు. సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు ఫాగింగ్ ఆయిల్ బాల్స్ అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.