అర్వపల్లి, అక్టోబర్ 28 : రానున్న 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులపై రెండు రోజులు పాటు టార్పాలిన్ పట్టాలు కప్పే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం అర్వపల్లి మండలంలోని తిమ్మాపురం, అర్వపల్లి, వేల్పుచర్లలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. మొంథా తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో రెండు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు వరి పొలాలు కోయకుండా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట డీఎస్ఓ మోహన్ బాబు, డీఎం రాము, తాసీల్దార్ శ్రీకాంత్, ఏఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐ శ్రీకాంత్ రెడ్డి, ఏఓ గణేశ్, ఏఈఓ సత్యం, ఏపీఎం రాంబాబు, సెంటర్ ఇన్చార్జి విజయ ఉన్నారు.
అర్వపల్లి మండల పరిధిలోని రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. 4, 5వ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారితో ఇంగ్లీష్ చదివించి తెలుగులో అర్థాలను అడిగి తెలుసుకున్నారు. అంతటితో ఆగకుండా గణితంలో సంకలనం, వ్యవకలనం, గుణాంకాలను బోర్డుపై చేయించి వారితోనే సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు ప్రతి ఒక్కరు సరైన సమాధానాలు చెప్పడం, చక్కగా రాయడం, మంచి ప్రతిభను చూపించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ సంతోషంతో విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఉపాధ్యాయులంటే ఇలా ఉండాలని, ఉపాధ్యాయుల పనితీరు విద్యార్థులు చదువులోనే కనిపిస్తుందన్నారు. ఉపాధ్యాయులు ధర్మయ్య, నీరజ, సుధారాణి, వెంకన్నను అభినందించారు.

Aravapally : వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్