పెన్‌పహాడ్, మే 17 : సూర్యాపేట అదనపు కలెక్టర్ రాంబాబుకు చుక్కెదురైంది. శనివారం పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయనకు రైతులు ప్రశ్నల వర్షాన్ని సంధించారు. ఆరుకాలం కష్టపడి పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక నానా యాతలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అదనపు కలెక్టర్‌తో పాటు వచ్చిన తాసీల్దార్ లాలునాయక్, ఏపీఎం అజయ్ నాయక్, ఇతర అధికారులు మమ అనిపించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పేరుకే ఏర్పాటు చేసినట్లు ఉందని రైతులు అన్నారు. కేంద్రం నిర్వాహకులు నుంచి మొదలు పెడితే.. కాంటాలు కాక ఒకపక్క, పాత, కొత్త గన్నీ బస్తాల పేరుతో మిల్లర్లు మెళికలు పెట్టడం. మరో పక్క ధాన్యం మాయిశ్చర్ వచ్చి కాంటాలు అయితే లారీలు రాక, మిల్లుల వద్ద దిగుమతి కాకపోవడం, ధాన్యం బాగాలేదని క్వింటాకు ఇంతని కటింగ్ ఒప్పుకుంటేనే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు చెప్పడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘోరం ఏందని చెప్పుకుందామంటే ఏసీలకే పరిమితం అయిన ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా ఫొటోలు దిగి వెళ్లిపోవడం వారికి పరిపాటుగా మారిందని దుయ్యబట్టారు.
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు దాటుతున్నా ఇంకా కాంటాలు కాకపోవడంతో రైతులు పట్టణ మార్కెట్, దళారులకు అడ్డికిపావుసేరు చొప్పున అమ్ముకోవడానికి ధాన్యాన్ని తీసుకుపోతున్నట్లు చెప్పారు. మిల్లర్లు, అధికారులు లాలూచీ పడడం, మిలర్లకు కళ్లెం వేయకపోవడంతో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారని, దీంతో తమ బతుకులు బజారు పాలువుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.