చివ్వెంల, ఏప్రిల్ 22 : ధాన్యం కొనే దాక రోడ్డు దిగే ప్రసక్తే లేదని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై రైతులు మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండా వద్ద కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని తీసుకొచ్చి నిప్పు పెట్టి రోడ్డుకు అడ్డంగా కంప వేసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. పంటలు కోసి 45 రోజులు అవుతుందని, ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఇరవై రోజులు అవుతున్నా కొనుగోలు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Farmers’ Protest : సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై రైతుల ధర్నా
ఎస్సారెస్పీ నీళ్లు అందకపోవడంతో కొంత నష్టపోయామని, ఇప్పుడు ధాన్యం కొనకపోవడంతో పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలు కష్టపడి పంట పండిస్తే అమ్ముకునేందుకు ఇన్ని అవస్థలా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. వరికోత మిషన్‌కు, మిత్తికి తెచ్చిన ఆసామికి డబ్బులు ఎలా ఇవ్వాలని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వేడుకున్నారు. రైతుల ధర్నాతో సూర్యాపేట – దంతాలపల్లి రహదారిపై సుమారు 3 కిలోమీటర్ల మేర ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. తాసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ సంతోష్‌కుమార్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు.
Farmers’ Protest : సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై రైతుల ధర్నా