వేములపల్లి, ఫిబ్రవరి 21: యూరియా కోసం రైతులు శనివారం వేములపల్లిలోని పీఏసీఎస్ కేంద్రం ఎదుట ఉన్న అద్దంకి హైవేపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌లో బుక్ చేసుకుందామని ఓపెన్ చేసే లోపే సెకండ్లలోపే యూరియా ఖాళీ అవుతోందన్నారు. దీంతో తమకు యూరియా దొరకడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం పాత పద్ధతిలోనే యూరియాను నేరుగా రైతులకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులు చేపట్టిన ధర్నాతో రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వచ్చి యూరియా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
భూదాన్ పోచంపల్లి ఫిబ్రవరి 21 : యాప్ ద్వారా యూరియాను పంపిణీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. శనివారం పట్టణ కేంద్రంలోని పోచంపల్లి పీఏసీఎస్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రక్రియ గందరగోళంగా ఉందని, ఈ పద్ధతిలో యూరియా దొరకడం లేదని, రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంట ప్రస్తుతం పొట్ట దశలో ఉందని, ఈ సమయంలో యూరియా వేయకపోతే దిగుబడి తగ్గిపోయి నష్టపోతామన్నారు. యూరియా లోడ్ రాగానే రెండు సెకండ్లలోనే యాప్‌లో నో స్టాక్ అని వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్‌ను రద్దుచేసి పాత పద్ధతిలోనే రైతులకు ఎరువులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నోముల మాధవరెడ్డి, కందాల సుధాకర్‌రెడ్డి, మైసగోని వెంకటేశం, రావుల శ్రీను, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పాలకవీడు,ఫిబ్రవరి 21 : రైతులకు యూరియా కూడా సరఫరా చేయడం చేతకాని దద్దమ్మ సర్కారు ఇదంటూ బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు రాపోలు నవీన్‌కుమార్ విమర్శించారు. పాలకవీడు పీఏసీఎస్ ఎదుట శనివారం రైతులు యూరియా యాప్‌ను వ్యతిరేకిస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు తగిన మొత్తంలో యూరియా ఇవ్వలేక తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు యాప్ పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. యూరియా కోసం ఎరువులు కేంద్రాల వద్ద రాత్రింబవళ్లు తిండీ తిప్పలు లేకుండా గంటల తరబడి రైతులు క్యూలో పడిగాపులు పడుతున్నారన్నారు. రైతులకు సకాలంలో యూరియాని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకులు పెరుమాళ్ల సతీష్ కుమార్,పోతుగంటి మధు,నాగార్జున, పలువురు రైతులు పాల్గొన్నారు.
చిట్యాల, ఫిబ్రవరి 21 : చిట్యాల మండలం వెలిమినేడు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. 560 బస్తాల యూరియాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచిన ఐదు నిమిషాలకే నో స్టాక్ చూపడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా స్టాక్‌ను ఉదయం ఆన్లైన్లో నమోదు చేసిన కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా అయిపొయిందంటూ మెసేజ్ వచ్చింది. అయితే సమీప ప్రాంత రైతులకు కాకుండా ముందుగా బుక్ చేసుకున్న కొందరికి మాత్రమే యూరియా అందిస్తున్నారని రైతులు ఆరోపిస్తూ సంఘం కార్యాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పీఏసీఎస్ సిబ్బంది ముందుగానే యాప్‌లో యూరియా బుకింగ్ చేయించుకుని బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఆన్లైన్లో ఉంచిన ఐదు నిమిషాలకే ఎలా అయిపోతుందని, సరైన సమయంలో యూరియా వేయకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్‌లో యూరియా బుకింగ్ చేసుకున్న రైతుల వివరాలను వెల్లడించాలన్నారు. యూరియా పంపిణీలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. యూరియా యాప్‌ను రద్దు చేసి పట్టాదారు పాసు పుస్తకాల ప్రకారం అందించాలని డిమాండ్ చేశారు.