నిడమనూరు, సెప్టెంబర్ 18 : యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిడమనూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి నిడమనూరు ప్రాథమిక సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు యూరియా రాలేదన్న సమాచారంతో ఆగ్రహించిన రైతన్నలు ప్రధాన రహదారిపైకి చేరుకుని ఆందోళనకు దిగారు. సుమారు రెండున్నర గంటల పాటు ఆందోళన కొనసాగడంతో ప్రధాన రహదారికి ఇరువైపులా 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళన విరమింప చేసేందుకు పోలీసుల యత్నం విఫలమైంది.
వ్యవసాయ శాఖ అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో పోలీసులు హాలియా ఏడీఏ సరిత కు సమాచారం అందించడంతో హుటాహుటిన ఆమె ఆందోళన ప్రదేశానికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి యూరియా రాగానే పంపిణీ చేస్తామని నచ్చజెప్పారు. తమకు టోకెన్లు జారీ చేయాలని రైతులు డిమాండ్ చేయడంతో 150 మంది రైతుల పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో శాంతించిన రైతులు ఆందోళనను విరమించారు. అనంతరం ట్రాఫిక్ ను పోలీసులు క్రమబద్ధీకరించారు.
నిడమనూరు మండల వ్యవసాయ అధికారి ముని కృష్ణయ్యపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెన్షన్ వేటు వేశారు. గురువారం ఉదయం రెండున్నర గంటల పాటు రైతులు రాస్తారోకో చేపట్టిన నేపథ్యంలో ఏఓ మునికృష్ణయ్య అందుబాటులో లేకపోవడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. వ్యవసాయ శాఖ కార్యాలయ నిర్వహణ, యూరియా పంపిణీలో ఉన్నతాధికారుల సూచనల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించిన నేపథ్యంలో సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు యూరియా పంపిణీలో వైఫల్యం చెందడం పట్ల సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం.