నల్లగొండ ప్రతినిధి, నవంబర్4(నమస్తే తెలంగాణ) : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు అస్సలు పొంతన ఉండడం లేదు. సరిగ్గా నెల రోజుల కిందట నల్లగొండ జిల్లాలో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ఇప్పటికీ ఒక అడుగు ముందుకు… రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా కొనుగోళ్లు ఉన్నాయి. జిల్లాలో వానకాలం సీజన్లో 7.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. కొనుగోళ్లు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ఆదివారం సాయంత్రానికి కొనుగోలు చేసిన ధాన్యం 14,370 మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే, రెండు శాతం ధాన్యం కూడా కొనుగోలు జరుగలేదు. ఈ సీజన్లో జిల్లాలో మొత్తం 346 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇందులో 266 కేంద్రాల్లో దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లు, 80 కేంద్రాలను సన్నధాన్యం కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేశారు. కేంద్రాలను దశల వారీగా ప్రారంభించినా నేటికీ కొనుగోళ్లు ఊపందుకోవడం లేదు. ఇందులో ప్రభుత్వం నాన్చివేత ధోరణే పెద్ద ప్రతిబంధకంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాక వెంటనే ధాన్యాన్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేయాల్సి ఉంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు సమీపంలోని రైస్‌మిల్లులను కేటాయిస్తారు. కానీ మిల్లర్లతో ప్రభుత్వం చర్చల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటున్నది. పెండింగ్‌లో ఉన్న ట్రాన్స్పోర్ట్ చార్జీలతోపాటు మిల్లింగ్ చార్జీలు క్లియర్ చేయాలని మిలర్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఇదే సమయంలో ధాన్యం కేటాయింపునకు గానూ ప్రభుత్వం మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీల షరతు విధించింది.
దీనిపై రోజుల తరబడి జాప్యం జరిగింది. అప్పగించిన ధాన్యాన్ని కష్టం మిల్లింగ్ రైస్‌గా తిరిగి ఇచ్చేప్పుడు మిల్లర్లు 67 కేజీల బియ్యం ఇవ్వాలనేది ప్రభుత్వ నిబంధన. సన్నధాన్యం విషయంలో అంత స్థాయిలో బియ్యం రావంటూ 58 నుంచి 60 కేజీల వరకే ఇవ్వగలమని మిల్లర్లు పేచీ పెడుతూ వచ్చారు. ఇలా రైస్ మిల్లర్లతో చర్చల మీద చర్చలు జరుగుతున్న సమయంలోనే పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చి పడుతున్నది. ఆ స్థాయిలో కొనుగోళ్లు మాత్రం ఉండడం లేదు. దాంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెజార్టీ సెంటర్లలో ధాన్యం తెచ్చి 15 రోజులు గడుస్తున్నా కొనడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభు త్వం నిర్దేశించిన తేమ శాతం 17 వచ్చి నా సరే కొనుగోళ్లు జరుపడం లేదని చెప్తున్నారు. ఇదే సమయంలో వర్షాలు కరుస్తుండడంతో తిరిగి ధాన్యం తడువడం లేదా తేమ శాతం పెరగడం జరుగుతున్నది. తిరిగి రైతులు మళ్లీ ధాన్యా న్ని ఆరబెట్టాల్సి వస్తున్నది. నిత్యం కొనుగోలు కేంద్రాల చుట్టూ రైతులు తిరిగి తిరిగి వేసారి పోతున్నారు.
మిల్లులకు దొడ్డు ధాన్యం విక్రయం
కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో విసిగిపోయిన రైతులు ధాన్యాన్ని వెనక్కి తీసుకుపోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న దండంపల్లి, రెడ్డికాలనీ వంటి కొనుగోలు కేంద్రాల్లోనే పరిస్థితులు ఇలా ఉంటే ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ధాన్యం తెచ్చి 20 రోజులు గడుస్తున్నా, 17శాతం తేమ ఉన్నా కొనకపోవడం, వర్షాలు రావడం, ధాన్యం తడవడం ఇలా అనేక ఇబ్బందులతో రైతులు విసిగిపోయారు. దాంతో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తిరిగి ట్రాక్టర్లకు ఎత్తుకుని దగ్గరలోని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. వాస్తవంగా కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే క్వింటాకు రూ.2,320 మద్దతు ధర లభించేది.
కానీ అక్కడ ఇబ్బందులు పడలేక క్వింటాకు రూ.300 నుంచి 500 వరకు నష్టం వచ్చినా సరే మిల్లులకు అమ్మకునేందుకు రైతులు సిద్ధుపడుతుండడం దయనీయ పరిస్థితిని కండ్లకు కడుతున్నది. దొడ్డు రకం ధాన్యానికి రైస్ మిల్లర్లు క్వింటా ఒక్కంటికి రూ.1,800 నుంచి 2,000 వరకు చెల్లిస్తున్నట్లు రైతులు చెప్తున్నారు. అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముకోక తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కేసీఆర్ సర్కార్‌లో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు లేవని రైతులు గుర్తు చేస్తున్నారు.
సన్నాలు కొనేది ఎక్కడ?
దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లే ఇలా ఉంటే సన్నాల గురించి రైతులు ఊహించలేకపోతున్నారు. సన్నాల కోనుగోలు కోసం 80 కేంద్రాలు ఏర్పాటు చేస్తే నేటికీ ఒక్క గింజను కొన్న దాఖాలాలు లేవు. రైతులు ఆ కేంద్రాలకు ధాన్యం తెచ్చేందుకే సుముఖత చూపడం లేదు. దొడ్డు రకాల కొనుగోలుకే దిక్కు లేదు… సన్నాలు కొంటారంటే నమ్మేది ఎలా అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి విక్రయిస్తే క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధరతోపాటు అదనంగా రూ.500 బోనస్ ప్రకటించినా రైతులు ముందుకు రావడం లేదు. ఎప్పటిలాగే నేరుగా మిల్లు పాయింట్లకే సన్నాలను తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ఇక్కడ తేమ శాతంతో సంబంధం లేదు. నేరుగా పొలం నుంచి మిల్లులకు ధాన్యం తీసుకెళ్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అటూఇటూగా అందుతున్నది. ఇక ప్రభుత్వం ఆశ పెడుతున్న బోనస్ కోసం చూస్తే మొత్తానికే ఇబ్బంది పడాల్సి వస్తుందన్న అనుమానంతో సన్నాల రైతులు కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడడం లేదు. కాగా, ఏడెనిమిదేండ్లల్లో ఎన్నడూ లేనివిధంగా పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ఈ వానకాలం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో పాటు సరైన ప్రణాళికలు రూపొందించడంలో విఫలమైనట్లు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోళ్లు జరుపాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్జాలబావి కొనుగోలు కేంద్రంలో 150 ధాన్యం కుప్పలు
నల్లగొండ రూరల్ : నల్లగొండ పట్టణ పరిధిలోని ఆర్జాలబావి వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్రంలోనే మొదటి సారిగా గత నెల 9న జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. మొదటి వారం రోజుల వరకు కొనుగోళ్లు చేపట్టలేదు. ఈ కేంద్రంలో ఇప్పటి వరకు 450 ధాన్యం రాశులు వచ్చాయి. 21 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా 10 నుంచి 15 వేల క్వింటాళ్ల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనుగోలు కేంద్రంలో 150 ధాన్యం కుప్పలు ఉన్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షానికి రైతులు ఇబ్బందులు పడుతూ ధాన్యాన్ని ఆరబెట్టుకునే పనిలోనే ఉన్నారు. లారీల అన్లోడ్ చేసుకోవడంలో ఆలస్యం అవుతున్నది. దీపావళి పండుగ ముందు ఒక నాలుగురోజులు లారీ రాలేదు. ప్రస్తుతం మ్యాచర్ వచ్చిన కుప్పలు 80 ఉన్నప్పటికీ వాటిని ఇంకా కాంటాకు వేయలేదు. కొనుగోలు చేసిన వారిలో కనీసం 10 మంది రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు పడలేదు.
కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభం కాని కాంటాలు
కోసిన వెంటనే మిల్లులకు తరలిస్తున్న రైతులు
గరిడేపల్లి, నవంబర్ 4 : మండలంలో 15 రోజుల క్రితం ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంతవరకు కాంటాలు మొదలు కాలేదు. మండలంలోని కీతవారిగూడెం, పొనుగోడు, గడ్డిపల్లి, సర్వారం గ్రామాలలో నాలుగు సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో గరిడేపల్లి మినహా అన్ని సహకార సంఘాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా రైతులు వడ్లు అమ్మటానికి సుముఖంగా లేరు. కల్లంలోనే రైతులు జేసీబీ, కూలీల సహాయంతో ట్రాక్టర్ల బోరంలో నింపి మిల్లులకు తరలిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర కోసం చూస్తే వడ్లు ఆరేసరికి పెట్టిన పెట్టుబడి కూడా రాదని, పంట కోసిన వెంటనే పచ్చి వడ్లను అదే రోజు మిల్లుకు పంపుతున్నారు.
పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మా మండలంలో వరి కోతలు ముమ్మురంగా జరుగుతున్నాయి. కానీ ఏ ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రంలో కూడా కాంటాలు మొదలు కాలేదు. పది రోజుల క్రితం నామమాత్రంగా బ్యానర్లు కట్టి చేతులు దులుపుకున్నారు. కొనుగోలు కేంద్రంలో స్థలాన్ని శుభ్రం చేయకుండా, వసతులు కల్పించకుండా వదిలేశారు. మండలంలో పేరుకు 11 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నా ఏ ఒక్క ఊరిలో కూడా ఇప్పటివరకు ఒక్క గింజ కొన్న దాఖలాలు లేవు. రైతులు నానా ఇబ్బందులు పడుతూ మిల్లర్లకే ఎంతకోకొంతకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి.
– అనుముల శ్యాంసుందర్‌రెడ్డి, రైతు, త్రిపురారం
దళారుల చేతిలో మోసపోవాల్సి వస్తున్నది
ప్రభుత్వం సన్న రకాలను కొంటామని చెప్పింది. ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పింది. అధికారులు మాత్రం సహకార సంఘాల ద్వారా 9, మహిళా సంఘాల ద్వారా రెండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పున్నరు. కానీ ఎక్కడా వడ్లు పోసుకోండి అన్న నాథుడు లేడు. సహకార సంఘం వాళ్లను అడిగితే ఇంకా కొన్ని రోజులు పడుతుందని చెప్తున్నారు. బస్తాలు లేవు, కాంటాలు లేవు అంటున్నారు. మిల్లర్ల వద్దకు వడ్లు తీసుకెళ్తే వాళ్లకు నచ్చిన రేటుకు వడ్లను అడుగుతున్నారు. కోతలు అయిపోయి నారుమళ్లు పోస్తున్నాము. ముందు వచ్చిన వడ్లకు లేకపోయినా వెనుకవచ్చే వడ్లకైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మిల్లర్ల వద్దకు వెళ్తే దళారుల చేతిలో మోసపోవాల్సి వస్తున్నది.
– అనుముల సుధాకర్‌రెడ్డి, రైతు, త్రిపురారం