నల్లగొండ సిటీ, ఆగస్టు 23 : యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లో పడిగాపులు కాసినా యూరియా బస్తా అందలేదని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కనగల్ పీఏసీఎస్‌లో యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలుసుకున్న మండల రైతులు ఉదయాన్నే అక్కడికి చేరుకుని క్యూలైన్లో ఉన్నారు. మండల కేంద్రంలోని సహకార సంఘానికి 200 యూరియా బస్తాలు రావడంతో ఒక్క పాస్ పుస్తకానికి రెండు బస్తాల యూరియా మాత్రమే ఇవ్వడంతో రైతులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదును దాటిపోయిన తర్వాత యూరియా వేసిన లాభం ఉండదని, దిగుబడులపై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీకి కేవలం 200 బస్తాలు మాత్రమే రావడంతో 25 శాతం మందికి పంపిణీ చేయగా, మిగిలిన రైతులు వెనుతిరిగి వెళ్లిపోయారు. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా యూరియా అందడం లేదని రైతులు వాపోయారు. ఇప్పటికే అదును దాటిపోతుందని, యూరియా ఇవ్వాలని సొసైటీ సిబ్బందిని కోరితే రేపు, మాపు అంటూ దాట వేస్తున్నరని మండిపడ్డారు.