తిరుమలగిరి, జూలై 20 :జిల్లా వ్యాప్తంగా జూలై మూడో వారంలోగా 171.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఎల్‌నినో ప్రభావం వల్ల ఇప్పటి వరకు 135.7 మిల్లీ మీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే 20.3 మిల్లీ మీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. వరి సాగుతో పాటు మెట్ట పంటలు వేసేందుకు సైతం రైతులకు వానకాలం కలిసి రాకపోవడంతో కష్టకాలం వచ్చింది. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. గడిచిన జూన్ నెలతో పాటు జూలై మాసం ముగుస్తున్నా వర్షాల జాడలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వరిసాగే ప్రశ్నార్థకంగా మారింది.
అదే విధంగా అడపా దడపా కురిసిన వర్షాలకు పత్తి ,పెసర, కందిలాంటి మెట్ట పంటలు వేసినా వర్షాలు లేక సగానికి పైగా విత్తనాలు భూమిలోనే వాడిపోయాయి. మొలకెత్తిన మొక్కలు సైతం వర్షాలు లేక చేలలో వాడిపోతుండటంతో రైతులు దిగులు చెందుతున్నారు. కరువు ప్రాంతమైన తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లోని ఎస్సారెస్పీ ఆయకట్టు భూములు బీళ్లుగా మారుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఆశించిన స్థాయిలో పత్తి పంట దిగుబడులు రాక రైతులు ఎంతో నష్టపోయారు. ఈ సారి కూడా అదే పరిస్థితి దాపురించే అవకాశం ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
సాగైంది 8,88,104 ఎకరాలే..
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ రకాల పంటలు సాగైంది 8,88,104 ఎకరాల్లో మాత్ర మే. ఇందులో వరి 1,31,334 ఎకరాలు కాగా, పత్తి 7,29,083 ఎకరాల్లో సాగైంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే సూర్యాపేట జిల్లాలో 93,892 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా వీటిలో 77,337 ఎకరాల్లో పత్తి, 12,252 ఎకరాల్లో వరి సాగు చేశారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 1,94,109 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా వీటిలో పత్తి 95,116 ఎకరా ల్లో, 91,526 ఎకరాల్లో వరి సాగు చేశారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 6,00,103 ఎకరాల్లో వివిధ పం టలు సాగు చేయ గా ఇందులో ప్రధానంగా పత్తి 5,56,630 ఎకరాల్లో, వరి 27,556 ఎకరాల్లో మాత్రమే సాగైంది.
ప్రశ్నార్థకంగా ఎస్సారెస్పీ ఆయకట్టు
జిల్లాలో ఎస్సారెస్పీ కాల్వల కింద మొత్తం 2,21,609 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కాల్వతో పాటు 69,70,71 మెయిన్ డిస్ట్రిబ్యూటరీ(డీబీఎం)లు ఉన్నా యి. తిరుమలగిరి మండల పరిధిలోని వెలిశాల వద్ద ప్రారంభమయ్యే 69 డిబీఎం కింద 69,956 ఎకరాల ఆయకట్టు ఉంది. దీని ద్వారా తుంగతుర్తి, నూతనకల్, మద్దిరాల మండలాలకు సాగు నీరు అందుతుంది. 70 డీబీ ఎం నాగారం మండ లం మా మిడిపల్లి వద్ద ప్రారంభఅవుతుంది. ఈ కాల్వ కింద నాగా రం, అర్వపల్లి మండలాల్లో 7,173 ఎకరా ల ఆయకట్టు ఉంది. 71 డిబీఎం కింద 1,44,480 ఎకరాల ఆయకట్టు ఉంది.
ఈ కాల్వ నాగారం మండలంలో ని ప్రగతి నగర్ వద్ద ప్రారంభమవుతుంది. దీని ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట, చివ్వెంల, కోదాడ నియోజక వర్గంలోని నడిగూడం, మోతె, మునగాల, మండలాలకు నీరందుతుంది. కాల్వల ద్వారా సాగునీరు అందక భూగర్భ జలాలు అడుగంటి, సాగు భూములు బీడు భూములుగా మారిపోయాయి. ఎస్సారెస్పీ కాల్వల పరిధిలోని 2,21,609 ఎకరాల ఆయకట్టులో ప్రస్తుతం 60 ఎకరాలు మాత్రమే సాగైనట్లు అంచనా. ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగునీరు అందించి రైతులను ఆదుకోవటంలో పూర్తిగా విఫలమైందని రైతులు వాపోతున్నారు. ఆయకట్టు కింద ఉన్న సాగు భూములు బీడు భూములుగా మారి పోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వట్టిపోతున్నాయి. వరిసాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఆరుతడికే ప్రాధాన్యం..
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు కంది, వేరుశనగ, పెసర్లు, నువ్వులు, బొబ్బర్లు, ఉలవలు, మినుములు, మిర్చి, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలు వేసుకోవటం మంచిదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వరి, పత్తి లాంటి పంటలు వేసి రైతులు ఆర్థికంగా ఇబ్బందు లు పడవద్దని సూచిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో వాటికే అధిక ప్రాధాన్యత ఇవ్వటం మంచిదని చెబుతున్నారు.
కేసీఆర్ హయాంలో వందరోజులు పారిన కాళేశ్వరం జలాలు..
కేసీఆర్ హయాంలో 2020లో కాళేశ్వరం జలాలు జిల్లాలో 100 రోజులు నిరాటంకంగా ప్రవహించాయి. ఎస్సారెస్పీ ఆయకట్టు మొట్టమొదటి సారి అంచనాకు మించి సాగైంది. చెరువులు , కుంటలు జలకళను సంతరించుకోవటంతో ఎస్సారెస్పీ ఆయకట్టు కోన సీమను తలపించింది. 2016లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతుల పంటలను కాపాడేందుకు కేసీఆర్ వరుసగా 42 రోజలు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు అందించారు. అదే విధంగా 2018లో 42 రోజులు, 2019లో 20 రోజులు, 2020లో ఏకంగా 100 రోజులు కాల్వల ద్వారా సాగునీరందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని రైతులు కొనియాడుతున్నారు.
కాల్వలు, చెరువులు, బోర్లు ఎండుతున్నాయి..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు అన్ని కష్టాలే వచ్చాయి. వర్షాల్లేవు. కాల్వలు, చెరువులు ,బోర్లు ఎండుతున్నాయి. కేసీఆర్ ఉన్నన్ని రోజులు కాల్వ కింద ఉన్న రైతులం.. సంతోషంగా సాగు చేసుకున్నాం. ప్రస్తుతం సాగునీరు లేక మూడెకరాలు పడావు పడింది. వ్యవసాయం ఎలా చేయాలో అర్థం కావటం లేదు. రైతులను పట్టించుకునే నాథుడే లేడు. వెంటనే ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగునీరందించి రైతులను ఆదుకోవాలి.
-బత్తుల విజయ్‌కుమార్, రైతు చిల్పకుంట్ల, నూతనకల్
రైతుల తలరాత మార్చిన కేసీయార్..
తెలంగాణ రైతుల తలరాత మార్చింది కేసీఆర్ ఒక్కరే. ఆయన హయాంలో కాల్వల ద్వారా సాగునీరు అంది వ్యవసాయం పండుగలా మారింది. మా గ్రామ పంచాయతీలో 8 సంవత్సరాలుగా ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు కాల్వల నీటితోనే వ్యవసాయం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం దండుగలా మారింది. అడుగడుగునా రైతులకు కష్టాలు వచ్చి పడ్డాయి. చెరువులు, కాల్వలు, ఎండి పోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. దీనితో లక్షలు ఖర్చు చేసి రైతులు బోర్లు వేయాల్సిన దుస్థితి నెలకొంది.
-దేవా నాయక్, మర్రికుంట తండా, తిరుమలగిరి