రైతాంగంపై కాంగ్రెస్ సర్కారు కపట ప్రేమకు సాక్ష్యంగా రెండు లక్షల రుణమాఫీ పథకం నిలుస్తున్నది. రుణం తీసుకున్న ప్రతి రైతుకూ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మొండిచెయ్యి చూపుతుండడం చర్చనీయాంశంగా మారింది. అప్పుడు అందరికీ అని చెప్పి… ఇప్పుడు చడీచప్పడూ లేకుండా కొర్రీలు పెడుతున్నది. సాధ్యమైనంత మేరకు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి ఆర్ధిక భారం తగ్గించుకునేందుకు కుట్రలు చేస్తున్నది. అందుకే పట్టాదారు పాస్‌పుస్తకం ప్రాతిపదికను అటకెక్కించింది. కేవలం రేషన్‌కార్డు ఆధారంగా ఒక కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ వర్తింపజేయాలంటూ ఆదేశాలిచ్చింది. ఇదే విషయం శనివారం నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌కుమార్ కూడా స్పష్టం చేయడం గమనార్హం. దాంతో మూడింట రెండొంతుల మందికి రుణమాఫీ రాదన్న చర్చ సర్వత్రా సాగుతున్నది.
– నల్లగొండ ప్రతినిధి, జూలై 20 (నమస్తే తెలంగాణ)
రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న తీరుకు పొంతన లేకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టాదారు పాస్‌పుస్తకం ఆధారంగానే రుణమాఫీ అమలు చేస్తామని పైకి ప్రకటించి క్షేత్రస్థాయిలో మాత్రం రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబానికి 2లక్షల రుణమాఫీ అని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అందుకే పెద్ద సంఖ్యలో రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్యలో కోత పడింది. క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు, సహకార సొసైటీల అధికారులు కూడా రేషన్‌కార్డు ఆధారంగానే రుణమాఫీ జరిగిందని చెప్తున్నారు. ఫలితంగా రుణమాఫీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లినైట్లెంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు నాలుగు లక్షల మంది వరకు లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులు ఉంటారని అంచనా. ఇందులో 1.76లక్షల మందికే రూ.941 కోట్లను రుణమాఫీ వర్తింపచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో కేసీఆర్ సర్కార్ 99,999 రూపాయల వరకే 4లక్షల పైచిలుకు రైతులకు రూ.2150 కోట్ల వరకు రుణాలను మాఫీ చేసింది. ఆ లెక్కన చూస్తే రుణమాఫీలో పెద్దఎత్తున కోతలు పెట్టినట్లు స్పష్టమవుతుంది. ఒక్క సూర్యాపేట జిల్లాను పరిశీలిస్తే.. ఇక్కడ రూ.2లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులు 2.53లక్షల మంది ఉన్నట్లు గతంలో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. వారందరికీ రుణమాఫీ వర్తింపజేస్తే రూ.3,350 కోట్ల వరకు వెచ్చించాలి. ఇందులోనే లక్ష లోపు రుణాలను పరిశీలిస్తే సుమారు 1.75లక్షల మందికి రూ.1,300 కోట్ల వరకు రుణాలు మాఫీ కావాల్సి ఉంది. కానీ గురువారం ప్రకటించిన జాబితా ప్రకారం కేవలం 56,274 మందికి రూ.282.98కోట్ల రుణాలే మాఫీ అవడం గమనించాల్సిన విషయం. వాస్తవ అంచనాలో 25శాతం వరకు కూడా రుణమాఫీ జరగడం లేదని స్పష్టమవుతున్నది. ఇదే విషయంపై అధికారిక సమాచారం కోసం ఎవరిని సంప్రదించినా ఎవ్వరూ నోరు మెదపని పరిస్థితి నెలకొంది.
రెండ్రోజులుగా రుణమాఫీ వర్తించని రైతులంతా బ్యాంకులకు, సొసైటీలకు బారులు తీరుతున్నారు. ఇక్కడ అధికారులు వాస్తవాలు చెప్పక తప్పడం లేదు. తమకు అసలు, వడ్డీ కలిపి లక్ష రూపాయల లోపే ఉన్నా ఎందుకు మాఫీ కాలేదంటే మీ కుటుంబంలో మరొకరికి కూడా అప్పు ఉంది కాబట్టి ఇద్దరికీ కలిపి లక్ష దాటితే రుణమాఫీ ఇప్పుడు ఉండదని కుండబద్దలు కొడుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలను పరిశీలిస్తే రేషన్‌కార్డు ఆధారంగానే మాఫీ చేస్తున్నారని సొసైటీ అధికారులు చెప్తున్నారు. ఇదేవిధంగా ఒక కుటుంబంలో ఎంతమంది రుణాలను తీసుకున్నా అందరికీ కలిపి గరిష్టంగా రెండు లక్షల రుపాయల వరకు మాఫీ జరుగుతుందని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక రేషన్‌కార్డులో పేర్లు లేని రైతులకు రుణమాఫీని పక్కన పెట్టేశారు. ఇలాంటి వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. వీటన్నింటి వల్ల రుణమాఫీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు ఇప్పుడు బాధపడుతున్నారు. రుణం తీసుకున్న ప్రతి రైతుకూ రెండు లక్షల వరకు రుణమాఫీ అని ఎన్నికలప్పుడు చెప్పి… ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సీజన్లలోనూ కాలం కాక పంటలు సరిగ్గా పండక ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ తీరు మరింత ఆందోళనకరంగా మారింది.
కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ
ఒక కుటుంబానికి రెండు లక్షల వరకే రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖాధికారి పి.శ్రవణ్‌కుమార్ వెల్లడించారు. శనివారం తన కార్యాలయంలో ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ కుటుంబాల నిర్ధారణకు రేషన్ కార్డునే ప్రాతిపదికగా తీసుకున్నారని చెప్పారు. పలు అంశాలపై శ్రవణ్‌కుమార్ స్పందిస్తూ… ‘ప్రభుత్వం క్లియర్‌గా చెప్పింది. కుటుంబం ప్రాతిపదికన ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీకి జీఓ విడుదల చేసింది. 18వ తేదీన జిల్లాలో లక్ష లోపు రుణం ఉన్న 83వేల మందికి రూ.454 కోట్లను విడుదల చేశారు. 80వేల మందికి ఇప్పటికే డబ్బు జమైంది. లక్ష లోపు రుణం ఉండి కూడా మాఫీ కాకుంటే ఆధార్ కార్డు తీసుకుని వస్తే రైతులకు కారణాలు చెప్తున్నం. కుటుంబంలో ఇంకో సభ్యుడితో కలిపి లక్ష రుణం దాటితే మాత్రం రెండో దఫాలో రుణమాఫీ రావచ్చు. కుటుంబాల నిర్ధారణకు రేషన్ కార్డునే పరిగణలోకి తీసుకున్నారు. కొన్ని అకౌంట్లలో కుటుంబాలను కలిపి చూడడంలో సమస్యలు ఉన్నాయి. గతంలో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించిన వారికి రుణమాఫీ వర్తించదు’ అని స్పష్టం చేశారు.
లోన్ లక్షలోపే ఉన్నా మాఫీ కాలేదు
మాది తిరుమలగిరి మండలంలోని తాటిపాముల గ్రామం. నేను రూ.65 వేలు, నా కొడుకు రాకేశ్ రూ.60 వేలు వేర్వేరు పట్టాదారు పాస్ పుస్తకాలతో నాగార్జున గ్రామీణ బ్యాంకులో రుణం తీసుకున్నాం. ప్రభుత్వం లక్షలోపు రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేసింది. కానీ.. మా పేర్లు మాత్రం ఆ లిస్టులో లేవు. రేషన్ కార్డులు వేరుగా లేనందున మాఫీ కాలేదా.. అనుకుంటే మా ఊరిలో ఒకే రేషన్ కార్డులో పేరు ఉన్న ఇద్దరికీ రుణమాఫీ అయ్యింది. మాకు కూడా రుణమాఫీ జరుగుతుందని ఎంతో ఆశపడ్డాం. కానీ.. మాకు మాత్రం మాఫీ కాలేదు.
– యామగాని శారద, తాటిపాముల, తిరుమలగిరి మండలం, సూర్యాపేట జిల్లా