యాదాద్రి భువనగిరి, మే 8 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మారింది. ప్రభుత్వ ప్రచార ఆర్భాటాలే తప్ప.. ఫలాలు మాత్రం అందడం లేదు. మండలానికో గ్రామం దత్తత పేరుతో ఒక్క శాతం కూడా అమలు చేయకుండా చేతులు దులుపుకొన్నది. అర్హుల జాబితా పేరుతో హడావుడి చేసి అటకెక్కించింది.
భూమిలేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పెట్టింది. ఇందులో భాగంగా కూలీలకు ప్రతి సంవత్సరం రూ. 12వేల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు విడుతల్లో సాయం అందనుంది. ఈ పథకానికి భూమి లేని వ్యవసాయ కూలీలు అర్హులుగా నిర్ణయించారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అంతటా ఒకేసారి అమలు చేయాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వం పలు కారణాలతో పథకాన్ని కుదించారు. మండలానికో గ్రామం దత్తత అంటూ సర్కార్ కాలయాపన చేసే ప్రయత్నం చేసింది. దీంతో జిల్లాలోని 17 మండలాల్లో 17 గ్రామాలను హడావుడిగా ఎంపిక చేశారు. అవి కూడా చిన్న గ్రామాలను సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 324 మందికి మాత్రమే రూ. 6వేల చొప్పున సాయం అందించి చేతులు దులుపుకొంది. అంటే జిల్లాలో 421 గ్రామాలు ఉండగా, కేవలం 17 పల్లెలకే పరిమితం చేశారు.
పథకం అమలులో జాప్యంతో ప్రజల నుంచి వ్యతిరేకతను తప్పించుకునేందుకు సర్కార్ కొత్త ఎత్తుగడను ఎత్తుకుంది. లబ్ధిదారుల ఎంపిక పేరుతో తాత్సారం చేసింది. vఅర్హుల ఎంపిక కోసం ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డుల ఆధారంగా వివరాలు సేకరించింది. ఫీల్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ఈ ప్రక్రియను చేపట్టారు. మండల కంప్యూటర్ సెంటర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు సమాచారాన్ని క్రోడీకరించారు. జిల్లాలో మొత్తంగా 10,517 మందిని అర్హులుగా తేల్చారు.
కాంగ్రెస్ వ్యవస్థాపక దినమైన డిసెంబర్ 28 తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో తొలి విడుత రూ. ఆరు వేల వేస్తామని ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. నాలుగు నెలలు దాటినా ఇప్పటి వరకు దత్తత గ్రామాలు మినహా మిగతా చోట్ల పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం వద్ద నిధులు లేవని, అందుకే పథకం ఆమలు ఆలస్యం అవుతున్నదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని వ్యవసాయ కూలీలు కోరుతున్నారు.