యూరియా దొరకక పంటలకు నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో వరినాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతో చెప్పులు, రాళ్లు, పాస్ పుస్తకాలతో గంటల తరబడి క్యూలో నిలబడిన రైతాంగానికి కడుపు మండి ధర్నాలు.. రాస్తారోకోలు చేస్తూనే ఉన్నారు. యూరియా వేయకపోవడంతో ఇప్పటికే జిల్లాలో వేల ఎకరాల్లో వరిపంట ఎర్రబారింది. పత్తి చేలకు బలం లోపించి ఆశించిన మేర పూత, కాత రావడం లేదని రైతులు వాపోతున్నారు.
సూర్యాపేట, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఖర్మకాలి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎవ్వరినీ.. ఎవ్వరూ బాగు చేయలేరు. తాను ఇచ్చేవన్నీ రివర్స్ అవుతాయని గత ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నేడు కళ్లెదుట సాక్షాత్కరిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రధానంగా రైతుల పరిస్థితి మరీ దిగజారిపోతోంది. కాళేశ్వరం జలాలు మాయం, ఎండిపోయిన పంటలు, రైతుబంధు పోయిం ది, రుణమాఫీ పూర్తి కాలేదు, ధాన్యం కొనుగోళ్లలో మోసం, బోనస్ ఇవ్వడంలో దగా, విద్యు త్ కోతలు, ఈ సీజన్లో రైతులకు యూరియా కష్టాలు.. అబ్బో చెప్పనలవి కాకుండా ఉంది. కొద్ది రోజుల నుంచి ధాన్యం కోసం రైతులకు ఉమ్మడి రాష్ట్రంలోని పరస్థితి దాపురించింది.
రేయింబవళ్లు నిద్రాహారాలు మాని యూరి యా కోసం విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యా డు. ఎప్పుడోగాని ఒకటి అర బస్తా ఇస్తున్నారు. ప్రతి నిత్యం జిల్లా వ్యాప్తంగా రైతుల ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలతో అట్టుడికిపోతోంది. పోలీసు పహారా మధ్య యూరియా పంపిణీ చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్నా మేం ఎన్నుకున్నదంటూ రైతులు చెంపలేసుకుంటూ శాపనార్థాలు పెడుతున్నారు. యూరియా దొరక్క పంటలకు నష్టం వాటిళ్లుతోంది. 60 వేల ఎకరాల్లో వరి ఎర్రబారుతోంది.
పిలకలు వేయని వరి
సాధారణంగా వరి నాట్లు వేసిన వెంటనే బలం కోసం రైతులు యూరియా వేస్తారు. ఈసారి యూరియా దొరక్కపోవడంతో వేసిన నారు బతకకపోగా నాటు వేసిన చోట రెండు మూడుకు మించి పిలకలు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో యూరియా వేస్తే కాండాలు బలంగా మారి కనీసం 30 నుంచి 40 పిలకలు వేయగా ఈసారి పిలకలు తగ్గి దిగుబడి భారీగా తగ్గే అవకాశం కనిపిస్తున్నదని అంటున్నారు.
పూత కాత తగ్గిన పత్తి
యూరియా కొరతతో పత్తికి పూత, కాత రావడం లేదని రైతులు వాపోతున్నారు. పత్తి, వరిలో నానో యూరియా, నానో డీఏపీ స్ప్రే చేస్తే చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి సూచించారు.
పిలకలు వేయలేదు
నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. సాగు చేసిన వరి ఎదుగుదల సమయంలో యూరియా అందకపోవడంతో పొలం మొత్తం పిలకలు వేయకలు వేయలేదు. పంట ఎర్రబారి పేలవంగా కనిపిస్తున్నది. సమయానికి యూరియా అందకపోవడంతో ఎకరానికి రూ.25 వేలకంటే ఎక్కువ నష్టపోతున్నా. చాలా మంది రైతులు యూరియా అందక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులందరికీ యూరియా సరఫరా చేయాలి.
-గుంటి రవికుమార్, జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి రైతు
రైతులను నిండా ముంచిన రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కోసం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. వరికి సమయానికి ఎరువు వేయకపోతే ఎదుగుదల లోపిస్తుంది. దీంతో దిగుబడి తగ్గడంతో పాటు అప్పుల పాలు కావడం.. ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప చేసేదేమీ లేదు. నేను 20 ఎకరాల కౌలుకు తీసుకొని నెల క్రితం వరి సాగు చేసిన. పది రోజులుగా సొసైటీ చుట్టూ తిరిగితే 4 బస్తాల యూరియా దొరికింది. అది ఒక్క మూలకు సరిపోలేదు. మార్పు తెస్తానని రేవంత్‌రెడ్డి రైతులను నిండా ముంచిండు.
-షేక్ బందీ సాబ్, పెన్‌పహాడ్ మండలం అనంతారం రైతు