మునుగోడు, ఆగస్టు 14 : నానో యూరియా ఉపయోగంపై మునుగోడు వ్యవసాయ అధికారి ఎస్.పద్మజ రైతులకు అవగాహన కల్పించారు. గురువారం మునుగోడు ప్రాథమిక సహకార సంఘంలో యూరియా సరఫరాపై ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నానో యూరియూ గురించి రైతులకు వివరించారు. నానో టెక్నాలజీ అనేది సైన్స్, ఇంజినీరింగ్ కలబోత అన్నారు. పరిమాణము మారదు కాని ఉపరితల వైశాల్యం పెరుగుతుందన్నారు. ఎక్కువ ఉపరితల వైశాల్యం అంటే ఆకు ఉపరితలంపై ఎక్కువ చర్య అని, దీనివల్ల ఎక్కువ పీల్చుకోవడం (శోషణ) జరుగుతుందన్నారు. వ్యవసాయంలో నానో టెక్నాలజీ సాంప్రదాయ ఎరువుల స్థానాన్ని భర్తీ చేస్తుందని తెలిపారు. దీంతో మెరుగైన పంట ఉత్పాదకత లభిస్తుందన్నారు. నానో యూరియాను రెండుసార్లు పై పాటుగా పిచికారి చేయాలన్నారు. ఒక ఎకరానికి అర లీటరు సరిపోతుందని, సాంప్రదాయ యూరియాతో పోల్చినా నానో యూరియా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుందని తెలిపారు.