పెద్దఅడిశర్లపల్లి, నవంబర్ 27 : ఆరుగాలం కష్టించి పండించిన పత్తి దళారుల కంటే సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు దగాపడుతున్నారు. అటు మిల్లర్లు, బయ్యర్లు ఇటు అధికారులు కుమ్మకై పత్తి రైతును చిత్తు చేస్తున్నారు. మద్దతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో కోత కోస్తూ రైతులను ముంచుతున్నారు. 30 నుంచి 40 క్వింటాళ్ల ట్రాక్టర్‌కు రెండు నుంచి మూడు క్వింటాళ్ల పత్తిని కోత కోస్తేనే కొంటామని, లేదంటే దిగిన పత్తిన సైతం ఎత్తుకొని పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పత్తి కోతకు నిరాకరించిన రైతుల ట్రాక్టర్లను రెండు మూడు రోజుల వరకు నిలిపివేసి, దళారుల పత్తిని మాత్రం వెంటనే కొనుగోళ్లు చేస్తున్నారు. ఇది పీఏపల్లి మండల పరిధిలో జరుగుతున్న పరిస్థితి.
కొండమల్లేపల్లి మార్కెటింగ్ పరిధిలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. దీని పరిధిలో పీఏపల్లి నీలంనగర్ సమీపంలో రెండు మిల్లులు మరియు కొండమల్లేపల్లి, డిండి పరిధిలో కలిపి నాలుగు మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు చేపడుతున్నారు. పక్కన నాగార్జున సాగర్, మిర్యాలగూడ ప్రాంతాల్లో కొనుగొలు కేంద్రాలు లేకపోవడంతో దేవరకొండతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పత్తి తరలి వస్తున్నది. కానీ ట్రాక్టర్లలో వచ్చిన పత్తిని జాప్యం చేస్తూ ప్రైవేటు కొనుగోళ్ల పేరుతో డీసీఎంలలో దళారులు తీసుకొచ్చిన పత్తిని దిగుమతి చేసుకోవడం గమనార్హం.
మిల్లుల వద్దకు తీసుకొచ్చిన పత్తి ట్రాక్టర్లకు ముందుగా టోకెన్లు జారీ చేసి తేమ శాతం చూస్తున్నారు. తేమ 8 శాతం వస్తే క్వింటాల్‌కు రూ. 7,500, 12 శాతం వస్తే రూ.7,200 మద్దతు ధర ప్రకటించారు. కానీ ట్రాక్టర్ మిల్లులోకి వెళ్లిన తర్వాత పత్తిలో కాయలు ఉన్నాయని, నాణ్యత లేని పత్తి ఉందనే సాకుతో ట్రాక్టర్‌కు రెండు నుంచి మూడు క్వింటాళ్ల పత్తి కోత కోస్తున్నారు. దీంతో రైతు రూ.20 వేల వరకు నష్టపోతున్నారు. కోతకు అంగీకరించని రైతులను దిగుమతి అయిన పత్తిని తీసుకుని ప్రైవేటులో అమ్ముకోండని చెప్తున్నారు. దిగుమతి అయిన ట్రాక్టర్ కోతకు గురైన పత్తి బదులు బండి కాంటా వేసేటప్పుడు మనషులు నిలబడటం లేదా వేబ్రిడ్జిపై తూకం రాళ్లు వేసి కోత కోయడం చేస్తున్నారు. ప్రశ్నించిన రైతుల ట్రాక్టర్లు రోజుల తరబడి బయట ఉండగా, దళారుల ట్రాక్టర్లను నేరుగా దిగుమతి చేస్తున్నారు. పక్కనే ఉన్న మరో మిల్లును స్థానిక వ్యాపారులు ఆంధ్రవ్యాపారులకు లీజుకు ఇవ్వడంతో వారు టాటా ఏస్ ఆటోకు 50 కిలోల చొప్పున పత్తి కోత విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించించి పత్తి కొనుగోలు కేంద్రాల్లో మోసాలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.
పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులను నుంచి రెండు మూడు క్వింటాళ్లు కటింగ్ చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఇప్పటీకే మిల్లు వద్దకు వచ్చిన రైతులకు అవగాహన కల్పించే బోర్డులు ఏర్పాటు చేశాం. దిగుమతి అవుతున్న క్రమంలో బాగాలేని పత్తిని ప్రైవేటులో విక్రయించుకునే అవకాశం ఉంది. కానీ మిల్లర్లు కటింగ్ చేయరాదు. దళారుల ప్రమేయం లేకుండా పత్తిని కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. రైతులను మోసం చేయకుండా చర్యలు చేపడుతాం.