కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ పథకం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంతులేని కథలా సాగుతున్నది. రోజుకో కొత్త నిర్ణయం రైతులను పరేషాన్ చేస్తున్నది. లోన్ మాఫీ కావాలంటే తిరుగక ఏం చేస్తారన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని రైతాంగం మండిపడుతున్నది. ఇప్పటివరకు మూడు విడుతల రుణమాఫీ జాబితాల్లో పేర్లు వచ్చిన వారికి మినహా అదనంగా ఒక్క రైతుకు కూడా రుణమాఫీ అయిన దాఖలాలు కనిపించడం లేదు. ఆ పత్రాలు ఇవ్వండి.. ఈ పత్రాలు ఇవ్వండి… అయిపోతుందంటూ మంత్రులు, అధికారులు చెప్పడమే తప్ప పని అయ్యింది లేదని రైతులు వాపోతున్నారు. వాళ్ల మాటలు నమ్మి నెల రోజులుగా రైతులు వ్యవసాయ పనులను వదిలి బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగాల్సి వస్తున్నది. రోజురోజుకో కొత్త డైరెక్షన్‌తో ప్రభుత్వం కూడా అమోయమయానికి గురిచేస్తున్నది. రుణమాఫీ కాని రైతులు వాళ్లంతట వాళ్లే ఆశలు వదులుకునేలా చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డు లేని రైతుల సర్వే పేరుతో సాగుతున్న తతంగంపైనా సందేహాలు నెలకొన్నాయి. ప్రభుత్వానికి అందరికీ రుణమాఫీ చేసే చిత్తుశుద్ధి ఉంటే ఇన్ని కొర్రీలు అవసరమా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 6 లక్షల మంది వరకు 2 లక్షల రుణమాఫీకి అర్హులైన రైతులు ఉంటారని అంచనా. కానీ మూడు విడుతల్లో కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం 3.39లక్షల మంది రైతులకే మాఫీ చేసింది. మిగతా రెండున్నర లక్షల మంది రైతులను నిత్యం బ్యాంకుల చుట్టూ… అక్కడి నుంచి అధికారుల చుట్టూ తిప్పుతూనే ఉంది. నేటికి అదనంగా ఒక్క రైతుకు రుణమాఫీ అయిన దాఖాలాలు మాత్రం లేవు. అధికారుల వద్ద అలాంటి వివరాలేవీ లేకపోవడమే ఇందుకు నిదర్శనం. అందరికీ రుణమాఫీ అని ఎన్నికల హామీలో చెప్పి రేషన్ కార్డు ప్రామాణికంగా కుటుంబంలో గరిష్టంగా 2 లక్షల రుణమాఫీ వర్తింప చేశారు. ఇందులో కూడా వివిధ కారణాలతో అర్హులైన వేలాది మంది రైతులను వదిలేశారు.
దాంతో రుణమాఫీ కాని రైతులంతా తీవ్ర అయోమయంలో పడ్డారు. కుటుంబం మొత్తం కలిపి రెండు లక్షల లోపు రుణాలు ఉన్న రైతుల్లోనూ మాఫీ కానివారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ నెంబర్లలో పొరపాట్లు, ఆధార్ కార్డు, లోన్ అకౌంట్ పేర్లు సరిపోలక రుణమాఫీ నిలిచిపోయిందని అధికారులు చెప్తున్నారు. వాటిని సరిచేసేందుకు ఇప్పటికే ఓ దఫా రైతులంతా ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, లోన్ అకౌంట్ జిరాక్సులను దరఖాస్తు ఫారమ్‌తో కలిపి అధికారులకు సమర్పించారు. మండల స్థాయిలోనే గాక జిల్లా స్థాయిలోని గ్రీవెన్స్ సెల్లోనూ ఫిర్యాదు చేశారు. అలాంటి వారిలో ఎక్కువమంది లక్షన్నర లోపు రుణాలు ఉన్నవారు ఉన్నట్లు అంచనా. వారెవరికీ కొత్తగా రుణమాఫీ అయిన దాఖలాలు లేవు. దాంతో రైతులంతా ప్రభుత్వం కొత్త డైరెక్షన్ ఇచ్చినప్పుడల్లా అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
ప్రస్తుతం రేషన్‌కార్డు లేని వారి వివరాలను మాత్రమే నమోదు చేస్తున్నారు. అర్హులై ఉండి కూడా ఇతర కారణాలతో రుణమాఫీ కాని వారి పరిస్థితి ఏంటనే దానిపై స్పష్టత కొరవడింది. రేషన్ కార్డు సర్వే సందర్భంగా ఇలాంటి రైతులు మళ్లీ ఒకసారి దరఖాస్తులతో వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు ఎప్పుడు రుణమాఫీ అవుతుందని ప్రశ్నిస్తుంటే తమకు తెలువదన్నదే అధికారుల సమాధానంగా వస్తున్నది. ఇప్పుడైతే రేషన్‌కార్డు లేని వాళ్లే రావాలి.. మీకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా డైరెక్షన్ ఇస్తే చూద్దాం అని చెప్తున్నారు.
ఇక ఒకే కుటుంబంలో రేషన్ కార్డు ఉండి 2 లక్షలకు పైగా రుణం ఉంటే వాళ్ల పరిస్థితి కూడా గందరగోళంగా మారింది. పైన ఉన్న అదనపు రుణాన్ని చెల్లించాలని చెప్తున్నా అందులోనూ స్పష్టత లేదు. దాంతో రైతులు అదనపు డబ్బును కట్టినా రుణమాఫీ వర్తిస్తుందా, లేదా అన్న సందేహాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు అప్పోసప్పో చేసి డబ్బు చెల్లిస్తున్నా ఎప్పుడు అవుతుందనే దానిపై గ్యారంటీ కనపడడం లేదు. తప్పొప్పులు, ఇతర కారణాలతో రుణమాఫీ నిలిచిపోయిన వారికి సైతం ఎప్పటివరకు మాఫీ కావచ్చన్న దానిపై స్పష్టత లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలా ఉంటే ప్రభుత్వం అందరికీ రుణమాఫీ ఇస్తామని ఆశ చూపుతూ రైతులను రోడ్డుమీదికి లాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ, జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ బేజారువుతున్న దారుణమైన పరిస్థితులు నెలకొనడం శోచనీయం.
వివిధ కారణాలతో రుణమాఫీ కాని వారందరి సమస్య పరిష్కరించి మాఫీ చేయాల్సిన ప్రభుత్వం ప్రస్తుతానికి రేషన్‌కార్డు లేని వారి కోసం ఓ సర్వే నిర్వహిస్తున్నది. ప్రత్యేకంగా యాప్ రూపొందించి అందులో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేస్తూ కుటుంబ నిర్ధారణ చేపడుతున్నట్లు ప్రకటించింది. అలాంటి రైతులంతా ఇప్పటికే ఓసారి తమ ఆధార్ కార్డులు, బ్యాంకు సేవింగ్ అకౌంట్, లోన్ అకౌంట్, దరఖాస్తు ఫారాలను వ్యవసాయ అధికారులకు అందజేశారు.
ఇవన్నీ ప్రస్తుతం వ్యవసాయ కార్యాలయాల్లో పాత పేపర్లుగా మిగిలిపోయినట్లే! ఇవేవీ తాజా సర్వేకు పనికి రావంటూ ఇంతకుముందు ఇచ్చిన పత్రాలన్నింటితోపాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా పెట్టి ధ్రువీకరణ పత్రాలను అందజేస్తేనే మూడు రోజులుగా జరుగుతున్న సర్వేలో రైతుల వివరాలను నమోదు చేస్తున్నారు. దీనికితోడు రుణం తీసుకున్న రైతుతోపాటు రైతు కుటుంబం మొత్తం అటెండ్ అధికారులు ముందు హాజరై సెల్ఫీ ఫోటో దిగాలని ఆదేశించారు. దాంతో ఇప్పటివరకు రైతు మాత్రమే తిరిగితే.. ఇప్పుడు కుటుంబం కూడా అధికారుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తున్నది.
కొన్నిచోట్ల భార్యాభర్తలు వస్తే సెల్ఫీకి అనుమతిస్తున్నారు. మరికొన్ని చోట్ల పిల్లలు, తల్లిదండ్రులు అంతా హాజరు కావల్సిందేనని చెప్తుతున్నారు. పిల్లలు, తల్లిదండ్రులు ఉండి రాలేదంటే మీ ఇష్టం.. మీమైతే సెల్ఫీ దింపుతాం.. రుణమాఫీ కాకపోతే తర్వాత మమ్మల్ని అనోద్దు అంటూ రైతులను గందరగోళపరుస్తున్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. ఇక ఇంటికే వెళ్లి సర్వే చేస్తామని మంత్రులు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నా క్లస్టర్లు లేదా గ్రామాల వారీగా సర్వే కొనసాగుతుండడం విశేషం. రేషన్ కార్డు లేని కారణంగా కాని రైతులు నల్లగొండ జిల్లాలో 35 వేలు, సూర్యాపేటలో 21 వేలు, యాదాద్రి భువనగిరిలో 15 వేల మంది రైతులు ఉండగా వారందరి సర్వేకు మరో పక్షం రోజులు పట్టవచ్చని అంచనా. వారి వివరాల సేకరణ అనంతరం ప్రభుత్వం అంగీకరిస్తే రుణమాఫీ అవుతుందని సమాచారం. అప్పటివరకు అంతా అయోమయమే.