సూర్యాపేట, జూలై 3 (నమస్తే తెలంగాణ): గతంలో ఎన్న డూ లేని విధంగా ఈ వానకాలానికి సంబంధించి ఆత్రమాత్రం మూసీ నీటిని వదిలారు. మరుసటి రోజే నిలిపేవేశారు. దీనికి కారణం ఎలాంటి పదవిగానీ.. ప్రొటోకాల్ లేని ఓ ప్రైవేట్ వ్యక్తి ఆదేశాలతో అవసరం లేని సమయంలో మూసీ నీటిని విడుదల చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వెంటనే నీటి సరఫరాను నిలిపివేయాలని, గతంలో ఇచ్చిన ప్రకారమే ఇవ్వాలని రైతుల నుంచి వత్తిడి, వినతులు రావడంతో నీటి సరఫరాను నిలిపివేసినట్లు మూసీవర్గాల ద్వారా తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి మూసీని పట్టించుకున్న నాథుడే లేకపోవడంతో దాదాపు 45 వేల ఎకరాల ఆయకట్టు కాస్త 13 వేల ఎకరాల్లో కూడా సాగు కాలేదు. రాష్ట్రం ఏర్పాటు అనంత రం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి రూ.కోట్లు వెచ్చించి డ్యాంకు కొత్త గేట్లను అమర్చడంతో పూర్వపు ఆయకట్టు మొత్తం స్థిరీకరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నాటి నుంచి రైతులు సం తోషంగా ఏటా రెండు పంటలు పండిస్తున్నారు. ఏమైందో ఏమోగానీ రైతులు ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేసేలా నీటిని విడుదల చేశారు. ప్రతిసారీ వానకాలానికి సంబంధించి జూలై మూడు లేదా ఆగస్టు తొలివారంలో విడుదల చేస్తుండగా..ఈసారి మాత్రం జూన్ చివరి వారంలోనే నీటిని విడుదల చేశారు.
సూర్యాపేటలో ఎలాంటి ప్రొటోకాల్ లేని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి ఆదేశాలతో మూసీ నీటిని విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిజంగా అవసరం ఉంటే నీటిని విడుదల చేసినా పర్వాలేదుగానీ అవగాహన లేని వ్యక్తి మాటలు విని నీటిని విడుదల చేసి, ఆ వెంటనే నిలిపివేయడం ప్రజల్లో అభాసుపాలు కావడం ఎందుకనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఇరిగేషన్ శాఖ వర్గాల వద్ద ప్రస్తావిస్తే ప్రైవేట్ వ్యక్తి ఆదేశాలతోనే విడుదల చేశారని, రైతుల వినతి మేరకు వెంటనే నిలిపేశామని చెబుతున్నారు. ఇకనైనా అవగాహన లేని నాయకుల మాటలు వినకుండా అవసరమున్నప్పుడు నీటిని విడుదల చేయాలని, అధికారులు అనాలోచితంగా వ్యవహరించొద్దని రైతులు కోరుతున్నారు.
ఈసారి వర్షాలు సకాలంలో కురుస్తలేవు. దీనికితోడు ఎల్‌నినో ప్రభావంతో కరువు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో రైతులు భయంతో నార్లు పోయలేదు. అధికారులు మూసీ నీటిని ముందస్తుగా జూన్ 29న విడుదల చేయడంతో రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జూన్ రెండో వారంలో నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించి ఉంటే నార్లు సిద్ధం చేసుకొని, ఇప్పుడు విడుదలయ్యే నీటితో నాట్లు వేసేవారమని రైతులు అంటున్నారు. ప్రస్తుతం నార్లు పోస్తే 25 రోజులకు ఏతకు సిద్ధమవుతుంది. అదే సమయంలో నీటి విడుదల నిలిచిపోతుంది. ఈ లెక్కన రెండో నీటి విడుదల సమయంలో నాట్లు వేయాలంటే నారు ముదిరిపోయే అవకాశం ఉంటుందని రైతులు ఇరిగేషన్ అధికారులకు వినతులు ఇచ్చారు. దీంతో అధికారులు నీటిని నిలిపివేశారు.