సూర్యాపేట, మార్చి 17 (నమస్తే తెలంగాణ)/పెన్‌పహాడ్ : పదెకరాల్లో వరి నాటు పెడితే ఏడెకరాలు ఎండింది.. ఆరెకరాలకు నాలుగెకరాలు గొర్లమేతకు తప్ప ఎందుకూ పనికి రాలేదు. మూడెకరాలకు ఎకరం మాత్రమే అట్లట్ల ఉంది. అదైనా నీళ్లందితేనే చేతికి వచ్చేది. పెన్‌పహాడ్ మండలంలో ఏ రైతును కదిలించినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పుష్కలంగా కాళేశ్వరం నీళ్లు రావడంతో అలాగే వస్తాయనుకొని పెన్‌పహాడ్ మండల రైతులు ఈ యాసంగిలో వరినాట్లు పెట్టారు. తీరా చుక్క నీరు రాకపోవడంతో దాదాపు 80 శాతం పంట ఎండిందని రైతులు వాపోతున్నారు. ఇక్కడ కాల్వలు, చెరువుల కింద కలిపి ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో 15,562 ఎకరాల సాగు భూమి ఉండగా, ఇప్పటికే 12వేలకు పైనే ఎకరాల్లో ఎండిపోయినట్లు తెలుస్తున్నది. ఈ సీజన్లో గోదావరి జలాలు మొత్తానికే రాకపోవడంతో బోర్లు, బావులు సైతం వట్టిపోయి నష్టపోయారు.
2018లో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రాగా, నాటి నుంచి 2023 యాసంగి వరకు నిరంతరాయంగా ఎస్సారెస్పీ కాల్వల్లో గోదావరి జలాలు ప్రవహించాయి. చివరి ఎకరా వరకూ కాళేశ్వరం జలాలు చేరాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి జిల్లా మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. మండలంలోని మేగ్యాతండా వద్ద గెయిల్ ఇండియా గ్యాస్ పైప్‌లైన్ కాల్వలకు అడ్డుగా ఉండగా, అధునాతన టెక్నాలజీతో పైప్‌లైన్ కింద నుంచి సొరంగం తవ్వించి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించి మండలానికి చిట్టచివర ఉన్న మాచారం గ్రామ చెరువును సైతం నింపారు. దానికితోడు నీళ్లు విడుదల చేసిన వెంటనే ముందుగా చివరి ప్రాంతాలకు పంపించాలని అధికారులు సూచించడంతో చివరి నుంచి ప్రారంభం వరకు ఎక్కడ చూసినా చెరువులు నిండుకుండలా కనిపించేవి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అలాంటి కృషితో నాడు రైతు లు ఏ రందీ లేకుండా పంటలు పండించారు.
కాంగ్రెస్ పాలనలో..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం బంద్ పెట్టడంతో 2024 తొలి యాసంగికే నీళ్లు కరువయ్యాయి. ప్రస్తుత యాసంగిలోనూ ప్రధాన కాల్వ అయిన డీబీఎం 71లో చిన్నపాటి పాయ కనిపిస్తున్నది. పొలాలకు వెళ్లాల్సిన పిల్ల కాల్వల్లో నీళ్లే లేవు. దాంతో పెన్‌పహాడ్ మండలంలోని భక్తళాపురం, ధర్మాపురం, మేగ్యాతండా, దుబ్బతండా, మహ్మదాపురం, గాజులమల్కాపురం, నూర్జహాన్‌పేట, మాచారం, గూడెపుకుంటతండా, జల్మాలకుంట, చిన్నగారెకుంట, పెద్దగారెకుంట, చెట్లముకుందాపుం తదితర గ్రామాల్లో 80శాతం పంటలు ఎండిపోయాయి. ఆ పొలాల్లో రైతులు పశువులు, జీవాలను మేపుతున్నారు. వారాబందీ ప్రకారం ఇప్పటి వరకు ఐదు సార్లు నీటిని విడుదల చేసినా ఇక్కడి అంతంతమాత్రంగా కూడా నీళ్లు చేరలేదు. మరో విడతగా చివరిసారి విడుదల చేసినా మిగిలిన పంటలు కూడా కోలుకోనేలా లేవు. కొన్నిచోట్ల రైతులు పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పెడుతూ భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
నీళ్లియ్యడం చేతగాని ప్రభుత్వం పంటలు ఎండబెట్టి
మా తాతల నాటి నుంచి 2018 వరకు కూడా మా భూములకు ఎన్నడూ నీళ్లు రాలేదు. కేసీఆర్ పుణ్యమాని కాళేశ్వరం నీళ్లు రావడంతో 2023 వరకు ఏడాదికి రెండు పంటలు పండించుకున్నం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ ఇచ్చినట్లే నీళ్లు ఇస్తుందని అనుకుని ఏడెకరాల్లో వరి నాటు పెట్టినం. నీళ్లు రాక ఐదెకరాలు ఎండింది. మిగిలిన పంటలైనా దక్కాలంటే ఇంకో నెల రోజులు నీళ్లు అందాయి. బోర్లేమే ఆగి ఆగి పోస్తున్నయి. రేవంత్‌రెడ్డి సర్కారు రైతులపై కక్ష గట్టినట్టే నీళ్లివ్వట్లేదు. ఎకరానికి రూ.40వేలు పెట్టుబడి అయ్యింది. గత్యంతరం లేక ఎండిన పంటను ఎకరాకు 1,500 రూపాయల లెక్కన గొర్ల మందకు ఇచ్చిన. నీళ్లియ్యడం చాతగాని ప్రభుత్వం ఉంటే ఎంత? పోతే ఎంత? ఇప్పటికైనా కనికరం చూపి నీళ్లిస్తే ఆ రెండెకరాలైనా చేతికి వస్తుందని ఆశ.
-లావూరి రాంబాబు, రైతు, జల్మాల్కుంటతండా, పెన్‌పహాడ్ మండలం