వేములపల్లి మండలం బుగ్గబావి గూడెంనకు చెందిన రెండెకరాల రైతు జానయ్య యూరియా అవసరమై యాప్‌లో బుక్ చేస్తే తిప్పర్తి మండలంలోని ఇండ్లూరు గ్రామంలో తీసుకోవాలని ఆప్షన్ వచ్చింది. కనగల్‌కు చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఫర్టిలైజర్ యాప్‌లో యూరి యా బుక్ చేస్తే దేవరకొండలో తీసుకోమనే ఆప్షన్ వచ్చింది. ఇదీ యూరియా ఫర్టిలైజర్ యాప్ ద్వారా జరిగే అమ్మకాలు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. జిల్లాలోని మొత్తం రైతుల పరిస్థితి ఇదే.
నల్లగొండ, జనవరి 6 : నల్లగొండలోని దేవరకొండ రోడ్డులోని ఒక ఫర్టిలైజర్ దుకాణదారుడు రవాణా చార్జీలతో కలిపి బస్తా యూరియాను రూ.285 నుంచి రూ.295 వెచ్చించి కొనుగోలు చేస్తే రెగ్యులర్‌గా తన వద్దకు వచ్చే రైతులు కాకుండా ఇటీవల ఆయన దగ్గరకు మునుగోడు నుంచి వచ్చిన ఇద్దరు రైతులకు 12 బస్తాలు ఇచ్చాడట. అయితే బస్తాకు రూ.20 నుంచి రూ.30 నష్టంతో అమ్మాల్సి వస్తోందని…నష్టానికి యూరియా అమ్మాల్సిన అవసరం నాకేంటి అంటూ యూరియా కోసం డీడీలు కట్టడం మానేశారు. ఇది జిల్లాలోని ఫర్టిలైజర్ దుకాణదారుల పరిస్థితి.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఈ రబీ సీజన్లో తీసుకొచ్చిన యూరియా ఫర్టిలైజర్ యాప్ ద్వారా జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రబీ సీజన్ ఆరంభమై యూరియా అవసరం పెరుగుతున్నప్పటికీ స్థానికంగా యూరియా దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగానే ఎన్నో ఫర్టిలైజర్ దుకాణాలు ఉన్నప్పటికి ఒక్క బస్తా కోసం కిలోమీటర్ల దూరం పోవాల్సి రావటంతో సాగును వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూప్ ఆరంభ సమయంలో రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకోవచ్చని అనటంతో కొందరు రాష్ర్టాలే దాటిల్సిన పరిస్థితులు రావటంతో ప్రభుత్వం గత నెల 20వ తేదీ నుంచి ఈ లిమిట్‌ను జిల్లాలకు పరిమితి చేసింది. అయితే ఇప్పుడు జిల్లా హద్దులు పెట్టినప్పటికీ ఒకటీ రెండు బస్తాల కోసం 40,50 కిలోమీటర్లు పోవాల్సి రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లా పరిధి కాకుండా కనీసం మండల లిమిట్ ఆధారంగా పెట్టాలని రైతులు కోరుతున్నారు.
వరిసాగు చేస్తున్నామని..మాకు యూరియా కావాలని ఓ వైపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మరో వైపు మాత్రం ఫర్టిలైజర్ డీలర్లు మాత్రం మాకు యూరియా వద్దని వ్యవసాయ అధికారుల వద్ద నిర్మొహమాటంగా చెబుతున్నారు. గత ఖరీఫ్ సీజన్లో మా కంటే మాకని అధికారులపై ఎన్నో వత్తిళ్లు తెచ్చిన డీలర్లు ఈ సారి ఇస్తామన్నా తీసుకోకపోవటం గమనార్హం. తీసుకున్నా వాళ్లకు నచ్చిన..లేదంటే రెగ్యులర్‌గా తమ వద్దకు వచ్చే రైతులకు ఇవ్వలేకపోవటమే కారణంగా చెబుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఈ రబీ సీజన్లో 5.64లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచ నా వేసింది. అందులో ఇప్పటి వరకు 97వేల ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఈ యూప్ ప్రారంభమైన దగ్గర నుంచి 35వేల మంది రైతులు యూరి యా బుక్ చేసుకోగా అందులో ఎకరాకు మూడు బస్తాల లిమిట్‌తో ఇప్పటి వరకు 1.02 లక్షల బస్తా లు విక్రయించారు. ఈ యూరియా కూడా కిలోమీటర్ల మేర ప్రయాణించి, ఎన్నో వ్యప్రయాసలకోర్చి తీసుకొచ్చామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలో 15వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నప్పటికీ స్థానికంగా ఉండే వాళ్లకు మాత్రం అవకాశం రావటం లేదని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేను ప్రస్తుతం ఐదు ఎకరాల్లో వరి సాగు చేశా. ప్రస్తుతం మొదటి డోసు యూరియా వేయాలని యాప్ ఓపెన్ చేస్తే చాలా దూరంలో ఉన్న దుకాణాల్లో చూపిస్తోంది. నాకు కావాల్సిన కొద్దిమొత్తానికి కిలోమీటర్ల దూరం ఎలా వెళ్లాలి. అధికారులు రైతుల బాధను అర్థం చేసుకొని జిల్లా యూనిట్‌గా కాకుండా మండలం యూనిట్‌గా యూరియా ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. కనీసం పది కిలోమీటర్ల దూరంలో ఉంటే ఫర్వాలేదు కానీ, 40,50 కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అర్థం చేసుకోవాలి.
-అంతటి నగేశ్, ఖాజీరామారం, నల్లగొండ మండలం