మిర్యాలగూడ, ఆగస్టు 28: మండలంలోని శ్రీనివాస్‌నగర్‌లో గల సంగం డెయిరీ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఇక్కడ గతంలో ఉన్న వీటీ డెయిరీ ఎస్బీఐ నుంచి రుణం తీసుకుని తీర్చకపోవడంతో బ్యాంకు వారు డెయిరీని వేలం వేయగా, సంగం డెయిరీ యాజమాన్యం కొనుగోలు చేసింది. బుధవారం డెయిరీ ప్రారంభించగా… శ్రీనివాస్‌నగర్ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు.
వీటీ డెయిరీలో తాము పెట్టుబడులు పెట్టడమే గాక పాలు పోయడం జరిగిందని, ఆ డబ్బులను వీటీ డెయిరీ యాజమాన్యం ఇవ్వలేదని వాపోయారు. ఆ బకాయిలను చెల్లించిన తర్వాతే సంగం డెయిరీ నడపాలని డిమాండ్ చేశారు. గతంలో వీటీ డెయిరీలో 500 మంది వరకు ఉపాధి పొందగా, ప్రస్తుతం సంగం డెయిరీ వారు ఆంధ్రా ప్రాంతం నుంచి వర్కర్లను తీసుకొచ్చిన పనులు చేయిస్తున్నారని, స్థానికులకు ఉపాధి కల్పించాలని కోరారు.
కాగా, వీటీ డెయిరీ యజమానులు వెంకటేశ్వర్రావు, సత్యనారాయణ స్పందిస్తూ.. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం వీటీ డెయిరీ యూనిట్‌తోపాటు భూముల విలువ రూ.25కోట్ల వరకు ఉంటుందని, బ్యాంకు వారు తమకు సమాచారం ఇవ్వకుండా సంగం డెయిరీ వారితో కుమ్మక్కై రూ.11.50కోట్లకే వేలంలో అప్పగించారని ఆరోపించారు. ఈ విషయంపై హైకోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం డబ్బు చెల్లించడంతోపాటు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించిన తర్వాతే డెయిరీని నడపాలని కోరారు.